Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజపదునెక్కిన కత్తెర

పదునెక్కిన కత్తెర

- Advertisement -

అడవినుంచి విడివడ్డప్పుడు
ఊరుమనిషిని చేసి
నీకు శుభ్రత ఓనమాలు దిద్దింది నేనే కదా
నీ వికార రూపానికి
నాగరికపు సౌందర్యాన్నద్ది
మనిషి ఆనవాలు పులిమింది నేనే కదా
జంతువు నుంచి దూరం చేసి
ఊడలు దిగిన జులువాలును
కండ్లు బిత్తరబోయే క్రాఫింగ్‌ చేసింది నేనే కదా
సన్నని వేళ్ళ మధ్య ఆటగాని ఉత్సాహంతో
ఉరక లేస్తున్న కత్తెరతనంతో
నిమ్మకాయ నిలిపేంత
కత్తి మొన మీసాన్ని మలిచి
నీ రాజసానికి రంగులద్దింది నేనే కదా
వూరుకే పురుడు పోసి
బొడ్డుతాడు ముడేసింది మా తల్లులే కదా
ఊరు రోగాలకు రొష్టులకు
ఆకు పసరుతో నయంచేసే
ఆది వైద్యుడు దన్వంతరి నేనే కదా
కలప చేతపట్టి ఇల్లిల్లు తిరిగినా
అరే ఒరే అని అవమానించుడే కానీ
నన్ను మనిషిగా గుర్తించిందెన్నడు
భుజం మీద చెయ్యేసి మర్యాద చేసిందెన్నడు
నడిమింట్లకచ్చి నా కండ్లు తుడిసిందెన్నడు
ఆకలిపేగుల కేకలు విన్నదెన్నడు
పైగా కల్లి చిన్నగైనా, చెంపకు పోస మిగిలినా
చెయ్యి లేపుడు, పండ్లు కొరుకుడు అయినా
కాలం కుట్ర పన్నుతుందా
అద్దం అబద్దమాడుతుందా
నా ప్రతిభకు కితాబివ్వనీకి
పెదాల తీరందగ్గర ఆగిన
నీ అంతరాత్మకు తెలుసు
జంతువు కంటే పశువు కంటే
హీనంగా చూసే వూరే కాదు
రాజభవనమైనా నాకు స్మశానమే
ఇప్పుడు సిటీలో మెన్స్‌ పార్లర్లు
ప్రజాస్వామ్యంగా వెలుగుతున్నాయి
సెక్యులర్‌ సెలూన్లు క్యాస్ట్‌ లెస్‌గా సాగుతున్నాయి
ఒకే సీటులో ఒకే కత్తెరతో
నీ పక్కనే బాల అంబేద్కర్లు పిల్ల ఫూలేలు
నీతో పాటు తలతలా మెరుస్తూ
మీసం మెలేస్తూ అసెంబ్లీకి సిద్ధమవుతున్నారు.

డా. ఉదారి నారాయణ, 9441413666.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad