వరల్డ్ నం.1పై సెబాస్టియన్ సంచలన విజయం
మియామి ఓపెన్ టెన్నిస్ 2026
మియామి (యుఎస్‌ఏ)
వరల్డ్ నం.1, ఇటీవలే కెరీర్ స్లామ్ సాధించిన యంగ్ బుల్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్)కు ఊహించని భంగపాటు. గత వారం ఇండియన్‌వెల్స్ సెమీఫైనల్లో డానిల్ మెద్వదేవ్ చేతిలో ఓడిన అల్కరాస్.. తాజాగా మియామి ఓపెన్‌లో రెండో రౌండ్ నుంచే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా యువ ఆటగాడు సెబాస్టియన్ కార్డా (25) మూడు సెట్ల పోరులో అల్కరాస్‌ను చిత్తు చేశాడు. 6-3, 5-7, 6-4తో రెండు గంటల 19 నిమిషాల్లోనే వరల్డ్ నం.1 కథ ముగించాడు సెబాస్టియన్. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన సెబాస్టియన్.. రెండో సెట్లో 5-4తో మ్యాచ్ పాయింట్ ముంగిట నిలిచాడు. కానీ ఈదశలో వరుసగా ఐదు గేమ్‌లు గెలుపొందిన అల్కరాస్ మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లాడు.
నిరుడు మియామి ఓపెన్‌లో వరల్డ్ నం.55 డెవిడ్ గొఫిన్ చేతిలో ఓడిన అల్కరాస్.. ఈ ఏడాది వరల్డ్ నం.36 సెబాస్టియన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ విజేత ఇగా స్వైటెక్ (పొలాండ్) సైతం తొలి రౌండ్లోనే పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మియామి ఓపెన్‌లో వరుసగా సంచలనాలు నమోదు అవుతున్నాయి. సెబాస్టియన్ 12 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో మెరువగా.. అల్కరాస్ 2 ఏస్‌లు, 2 బ్రేక్ పాయింట్లతో సరిపెట్టాడు. పాయింట్ల పరంగా 101-97తో సెబాస్టియన్ పైచేయి సాధించాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో అమెరికా ఆటగాడు టామీ పాల్ గట్టెక్కాడు. 6-2, 3-6, 7-6(7-5)తో రాఫేల్ కొలిగన్‌పై మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు.
ఎదురులేని సబలెంక
మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి, ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వైటెక్ వరుస టోర్నమెంట్లలో ఇబ్బంది పడుతుండగా.. బెలారస్ భామ, వరల్డ్ నం.1 అరినా సబలెంక రెచ్చిపోతుంది. మహిళల సింగిల్స్‌లో వరుస విజయం సాధించిన సబలెంక ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అమెరికా అమ్మాయి కాటీ మెక్‌నాలీపై 6-4, 6-2తో సబలెంక గెలుపొందింది. 3 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో సబలెంక చెలరేగింది. పాయింట్ల పరంగా 69-51తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. కజకిస్తాన్ స్టార్, వరల్డ్ నం.3 ఎలెనా రిబకినా సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. 6-3, 6-4తో మార్టా (ఉక్రెయిన్)పై రిబకినా విజయం సాధించింది. గంటలోపే ముగిసిన మ్యాచ్‌లో రిబకినా దూకుడుగా ఆడింది. 2 బ్రేక్ పాయింట్లతో మార్టాను మట్టికరిపించింది. 65-52తో పాయింట్ల పరంగా రిబకినా పైచేయి నిలుపుకుంది.



