Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజాతీయ విపత్తుగా ప్రకటించాలి

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

- Advertisement -

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
ఉత్తర భారతంలో వరదలు, భారీ వర్షాలపై సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ :
ఉత్తర భారతంలో వరదలు, కొండచరియలు కూలిపడడం వంటి అసాధారణ పరిస్థితులు నెలకొనడంపై సీపీఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, రాజస్తాన్‌, ఢిల్లీల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కనివినీ ఎరుగనిరీతిలో చోటు చేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యంలో జరిగిన ప్రాణనష్టంపై సీపీఐ(ఎం) విచారం వెలిబుచ్చింది. ముఖ్యంగా పంజాబ్‌ ఈ వరదలకు బాగా దెబ్బతింది. రాష్ట్రంలోని 23 జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. రాష్ట్రంలోని 1655 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో చేతికి వచ్చిన పంట పూర్తిగానో లేదా పాక్షికంగా మునిగిపోయింది. నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు వరద బాధితులని వార్తలు పేర్కొంటున్నాయి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు అనేక డ్యామ్‌ల నుంచి మిగులు నీటిని విడుదల చేయడంతో బియాస్‌, సట్లెజ్‌, రావి, ఘగ్గర్‌ వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పంజాబ్‌, హర్యానాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. హర్యానాలోని 12 జిల్లాల్లో 1402 గ్రామాల్లో 2.5లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లోనూ వేలాది ఎకరాల్లో వరి పంట కుండపోత వర్షాలకు, వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. 170మందికి పైగా మరణించినట్టు వార్తలందాయి. రాజస్తాన్‌, ఢిల్లీల్లో పలు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా నష్టం వాటిల్లింది.

కేంద్రం విఫలం
హిమాచల్‌ప్రదేశ్‌ కూడా తీవ్రంగా నష్టాలను చవిచూసింది. 320మందికి పైగా మరణించారు. చాలామంది గల్లంతయ్యారు. పౌర సదుపాయాలు, భూములు, ఇండ్లు, పశువులు, పండ్లచెట్లు, పంటలు, వాహనాలు, గోశాలలకు తీవ్ర స్థాయిలో విధ్వంసం తాకింది. సిమ్లా, కులూల్లోని యాపిల్‌ తోటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు 25వేల ఎకరాల్లో ఉద్యానవన తోటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాఖండ్‌లో కూడా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం ఊహించని నష్టాన్ని కలగచేశాయి. అనేకమంది గల్లంతయ్యారు. ఇంతటి భారీ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని కోరింది. బాధితులకు సహాయాన్ని అందించండి: కార్యకర్తలకు సీపీఐ(ఎం) పిలుపు బాధిత ప్రాంతాల్లో సీపీఐ(ఎం) బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. బాధితులకు అవసరమైన సహాయ, సహకారాలు అందచేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యల్లో పాల్గొన్ని సహాయమందించాల్సిందిగా సీపీఐ(ఎం) తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు నిధులను సేకరించాల్సిందిగా కూడా పార్టీ పిలుపిచ్చింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad