– కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణతో బిఆర్ఎస్ లో వణుకు
– కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు అప్పగించడంతో బిఆర్ఎస్ నాయకుల్లో వణుకు మొదలైందని, ప్రజలను గందరగోళంలో పడేయడానికి వారు డ్రామాలకు తెర లేపారని సుడా చైర్మన్, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. మానేర్ డ్యాం నీటిని తీసుకొచ్చి కాళేశ్వరం జలాలుగా ప్రచారం చేస్తూ అమరవీరుల స్తూపంపై నీళ్లు చల్లడం అమరవీరులను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. అందుకే అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశామని నరేందర్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ అన్ని ఆధారాలను బయటపెట్టిందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులోని ఇతర బ్యారేజీలు, లింక్ కెనాల్స్‌లో కూడా నాసిరకం పనులు జరిగాయని కమిషన్ స్పష్టంగా పేర్కొందని ఆయన గుర్తుచేశారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును ఆకాశానికెత్తిన బిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు అవినీతి బండారం బయటపడుతుండడంతో డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఎన్ని డ్రామాలు చేసినా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చివరికి జైలుకు వెళ్లక తప్పదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, వెన్న రాజమల్లయ్య, దండి రవీందర్, అక్బర్ అలీ, సలీం, కుర్ర పోచయ్య, వంగల విద్యాసాగర్, ఎండి చాంద్ పాషా, నెల్లి నరేష్, బషీర్, మహమ్మద్ భారీ, షభానా మహమ్మద్, అస్థాపురం రమేష్, కుంభాల రాజ్ కుమార్, ముల్కల కవిత, షెహెన్ష, అస్థాపురం తిరుమల, సుదర్శన్, ఎల్లారెడ్డి, కిరణ్ రెడ్డి, లింగమూర్తి, జమీల్ తదితరులు పాల్గొన్నారు.