– గిల్, యశస్వి ధనాధన్ మెరుపులు
– రాణించిన రిషబ్ పంత్, కెఎల్ రాహుల్
– భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు తొలి రోజు
యువ బ్యాటర్లు వీరంగం చేశారు. లీడ్స్‌లో శతక జోరు చూపించారు. శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), యశస్వి జైస్వాల్ (101) సెంచరీలతో మెరిశారు. కెప్టెన్‌గా గిల్, బ్యాటర్‌గా యశస్వి ఇంగ్లాండ్ గడ్డపై తొలి ప్రయత్నంలో వంద బాదారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ శతకాలకు రిషబ్ పంత్ (65 నాటౌట్), కెఎల్ రాహుల్ (42) మెరుపులు జతకలవటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
నవతెలంగాణ-లీడ్స్
శుభ్‌మన్ గిల్ (127 బ్యాటింగ్, 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. సంప్రదాయ ఆఫ్‌సైడ్ ఆటతో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ పర్యటనను సెంచరీతో మొదలెట్టగా.. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో శతకొట్టాడు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (42, 78 బంతుల్లో 8 ఫోర్లు), రిషబ్ పంత్ (65 నాటౌట్, 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 85 ఓవర్లలో 359/3 పరుగులు చేసింది.
ఓపెనర్లు అదరగొట్టారు : భారత్ 92/2
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా మొదలెట్టారు. బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన జైస్వాల్ అదే దూకుడు కొనసాగించాడు. ఇక్కడి పిచ్‌లపై మంచి రికార్డున్న కెఎల్ రాహుల్ సైతం వెనక్కి తగ్గలేదు. కొత్త బంతితో వోక్స్, కార్స్, టంగ్‌లను ఓపెనర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇటు జైస్వాల్, అటు రాహులు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఫ్‌సైడ్‌లో యశస్వి పరుగులు రాబట్టగా.. రాహుల్ కండ్లుచెదిరే డ్రైవ్‌లతో మెప్పించాడు. ఓపెనర్ల మెరుపులతో 15 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది. అర్థ సెంచరీలతో తొలి సెషన్‌ను ముగించేలా కనిపించినా.. ఇంగ్లాండ్ ఆఖర్లో పుంజుకుంది. కార్స్‌పై కవర్‌డ్రైవ్‌తో బౌండరీ బాదిన రాహుల్.. అదే ఓవర్లో మరో డ్రైవ్‌కు ప్రయత్నించి స్లిప్స్‌లో దొరికిపోయాడు. సాయి సుదర్శన్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలో పడ్డాడు. స్టోక్స్ వేసిన లెగ్ సైడ్ వ్యూహంలో చిక్కుకున్న సాయి సుదర్శన్ (0) నాలుగు బంతులకే పెవిలియన్ బాట పట్టాడు. 24.4 ఓవర్లలో 91/0తో నిలిచిన భారత్.. వరుస వికెట్లతో 25.4 ఓవర్లలో 92/2తో పట్టు చేజార్చుకుంది. వరుస వికెట్లతో తొలి సెషన్లో ఇంగ్లాండ్ లెక్క సమం చేసింది.
లీడ్స్‌లో తొలి ఇన్నింగ్స్ బ్యాటర్లకు కఠిన సవాల్. పచ్చికపై కొత్త బంతితో పేస్‌ను ఎదుర్కొవటం కత్తి మీద సవాలే. అధిక ఉష్ణోగ్రతల నడుమ జరుగుతున్న టెస్టులో పిచ్‌ను స్టోక్స్, గిల్ అంచనా వేయలేకపోయారు. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలి సెషన్లో ఆఖరు రెండు ఓవర్ల వరకు ఆతిథ్య బౌలర్లకు కష్టాలు తప్పలేదు.
జైస్వాల్, శుభ్‌మన్ జోరు : భారత్ 215/2
లంచ్ తర్వాత భారత్ పట్టు బిగించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో జతకట్టిన జైస్వాల్ ధనాధన్ జోరు చూపించాడు. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు సహా ఓ సింగిల్‌తో 96 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. బంతిపై మెరుపు తగ్గాక యశస్వి దూకుడు పెంచాడు. 50 నుంచి 100కు చేరుకునేందుకు కేవలం 48 బంతులే ఆడాడు. 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అదరగొట్టాడు. సంప్రదాయ క్రికెట్ షాట్లతో ఆఫ్‌సైడ్‌లో పరుగులు పిండుకున్న యశస్వి.. లెగ్‌సైడ్‌లో కేవలం 9 పరుగులే చేశాడు. శుభ్‌మన్ గిల్ సైతం సహజశైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. ఎనిమిది ఫోర్లతో 58 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. గిల్ కెరీర్‌లో ఇదే వేగవంతమైన ఫిఫ్టీ. జైస్వాల్, గిల్ మెరుపులతో రెండో సెషన్లో భారత్ 26.2 ఓవర్లలోనే 123 పరుగులు పిండుకుంది. ఈ సెషన్లో ఇంగ్లాండ్‌కు ఒక్క వికెట్ దక్కలేదు.
గిల్, పంత్ ఫటాఫట్ : భారత్ 359/3
జైస్వాల్ (101) నిష్క్రమించినా.. మూడో సెషన్లోనూ భారత్ జోరు కొనసాగింది. దూకుడుగా ఆడిన శుభ్‌మన్ 14 ఫోర్లతో 140 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం బాది..విజరు హజారే, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లి సరసన నిలిచాడు. గిల్ ధనాధన్ జోరు చూపించగా.. రిషబ్ పంత్ సహజ శైలికి భిన్నంగా సహనంతో కనిపించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 91 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పంత్.. నాల్గో వికెట్‌కు గిల్‌తో కలిసి అజేయంగా 130 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరి సెషన్లో భారత్ 33 ఓవర్లలో 136 పరుగులు జోడించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గిల్ (127 నాటౌట్), పంత్ (65 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (బి) స్టోక్స్ 101, కెఎల్ రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42, సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ 127, రిషబ్ పంత్ బ్యాటింగ్ 65, ఎక్స్‌ట్రాలు : 24, మొత్తం : (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359.
వికెట్ల పతనం : 1-91, 2-92, 3-221.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 19-2-89-0, బ్రైడన్ కార్స్ 16-5-70-1, జోశ్ టంగ్ 16-0-75-0, బెన్ స్టోక్స్ 13-1-43-2, షోయబ్ బషీర్ 21-4-66-0.
శుభ్‌మన్, జైస్వాల్ శతకోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES