– ఆటో సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం జనవరి మూడో తేదీన తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లందరికీ ఆటో జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. అందులో బి.వెంకటేష్, అశోక్ (ఏఐటీయూసీ) పుప్పాల శ్రీకాంత్, కె.అజరు బాబు (సీఐటీయూ), మారయ్య రామకృష్ణ (బీఆర్టీయూ), ప్రవీణ్, లింగం గౌడ్(టీయూసీఐ), దయానంద్, రాజశేఖర్ రెడ్డి (ఐఎన్‌టీయూసీ), సత్తిరెడ్డి (టీఏడీఎస్), కొండారెడ్డి(టీఎన్‌టీయూసీ), గడ్డం శ్రీనివాస్ ( గట్స్), జాగృతి యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీమేరకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనుకూలంగా ఉన్నామంటూనే ఇంతవరకు దాని గురించి ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. ఫ్రీ బస్సు పథకాన్ని అమల్లోకి తెచ్చి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందనీ, వారిని ఆదుకునే దానికోసం నష్ట పరిహారం ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12,000 ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గడానికి కారణమైన రాపిడో బైక్స్ నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరితే దాని గురించి ఒక ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. రెండేండ్లు ఎదురుచూసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతోనే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టామని ప్రకటించారు. దాని జయప్రదం కోసం బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
3న అసెంబ్లీ ముట్టడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



