ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతల డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం కొనసాగిస్తోంది. మంగళవారం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించింది. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దని, వెంటనే ఫీజులు విడుదల చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. యూదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడిం చారు. ఎమ్మెల్యే లేకపోవడంతో క్యాంప్ కార్యాలయం గేటుకు వినతిపత్రం అంటించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంటిని ముట్టడించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణంలో గల పీఎస్‌ఆర్ గార్డెన్ నుంచి వైద్యాఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి పీఏకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలో మంత్రి వివేక్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద, ములుగులో ర్యాలీగా వెళ్లి మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాల ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ప్రయివేటు కళాశాలల బంద్
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రయివేటు కళాశాల అధ్యాపకులు నిరసన తెలిపారు. సాగర్‌రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభు త్వానికి ఆలోచన వచ్చేలా చేయాలని ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాల అధ్యాపకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజే శారు. కుమురంభీం జిల్లాలో కళాశాలల బంద్ రెండో రోజూ కొనసాగింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఏకలవ్య, పద్మావతి డిగ్రీ కళాశాలాలు నిరవధిక బంద్‌ను రెండో రోజూ కొనసాగించాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు.
‘ఫీజు’ కోసం మంత్రుల కార్యాలయాల ముట్టడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



