‘ఇఫీ’లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు సినిమాలు

3 గంటల క్రితం

IFFI
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

తెలుగు సినిమా అంటే భారీ మాస్ ఎంటర్‌టైనర్లు.. కమర్షియల్ హంగులే అనే పాత ముద్రను గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా తెలుగు కథలు చెరిపేస్తున్నాయి. దీంతో ఇఫీలో ఈ ఏడాది తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మయసభ’ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు నామినేట్ కాగా, ‘చాంద్ తారా వేవ్స్’ ఫిల్మ్ బజార్‌లో ప్రదర్శిత మైంది. ఇండియన్ పనోరమాలోనూ పలు తెలుగు చిత్రాలకు చోటు దక్కింది. ప్రయోగాత్మక, కమర్షియల్ కథలతో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో మరో మారు సత్తా చాటుతోంది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ నేపథ్యాల నుంచి వస్తున్న వైవిథ్య‌మైన‌ చిత్రాలు.. సిరీస్‌లు ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా నిలిచి ప్రాంతీయ సినిమా పరిధిని అంత‌కంత‌కు విస్తృతం చేస్తున్నాయి. ఒకే కోణంలో కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు.. కమర్షియల్ సినిమాలు.. పాత క్లాసిక్‌ల పున ప్రదర్శనతో తెలుగు కథలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఓటీటీ విభాగంలో `మయసభ: ద రైజ్ ఆఫ్ ద టైటాన్స్` ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు నామినేట్ కావడం తెలుగు కథా బలానికి దక్కిన గౌరవంగా దర్శకుడు దేవా కట్టా భావిస్తున్నారు. మయసభ వంటి సిరీస్ రాయడం మూడు నాలుగు సినిమాల పనితో సమానమని ఈ గుర్తింపు కొత్త దర్శకులను ఓటీటీ వైపు ఆకర్షిస్తుందని దేవా కట్టా అభిప్రాయపడ్డారు. ఆరు సమకాలీన చిత్రాలు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈసారి ఇఫీలో తెలుగు సినిమాకు లభించిన ప్రాధాన్యం కీలక మలుపు అని ఫీల్మ్ హిస్టోరియన్ డాక్టర్ హరికృష్ణ మామిడి చెప్పారు. గతంలో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆర్ట్, పారలల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని.. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఉండే తెలుగు చిత్రాలకు తగిన గుర్తింపు దక్కేది కాదని గుర్తు చేశారు. `మా భూమి`,` శంకరాభరణం`, `సాగర సంగమం`, `దాసి` వంటి చిత్రాల ప్రయాణాన్ని ప్రస్తావించారు. ప్ర‌స్తుతం నిబంధనలు మారడం.. కమర్షియల్ సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల తెలుగు సినిమాకు సరైన గౌరవం దక్కుతోందన్నారు.

తొలి ఓటీటీ వెబ్‌సిరీస్‌ ‘మయసభ’

ఇండియన్ పనోరమా విభాగంలో సింగ్ గీతం (ఫీచర్ ఫిల్మ్), `మన శంకర వర ప్రసాద్ గారు` (మెయిన్‌స్ట్రీమ్ సినిమా), `విన్` (నాన్-ఫీచర్ ఫిల్మ్) వంటి చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. అలాగే ఉత్తమ తొలి దర్శకుడి విభాగంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ నామినేట్ కాగా, 1976 నాటి `భక్త కన్నప్ప` గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ప్రత్యే కంగా నిలిచింది. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికీ అందరినీ విశేషంగా అలరిస్తోంది.తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ‘మ‌య సభ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇఫీలో బెస్ట్ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది.ఈనెల 20న అట్టహాసంగా ప్రారంభమైన ఇఫీ వేడుక నేటి (శనివారం)తో ముగియనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్