Saturday, July 5, 2025
E-PAPER
Homeఆటలుసిరాజ్‌ సిక్సర్‌

సిరాజ్‌ సిక్సర్‌

- Advertisement -

– ఆరు వికెట్లతో విజృంభించిన మియాభారు
– జెమీ స్మిత్‌, బ్రూక్‌ మెరుపు సెంచరీలు
– ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 407/10
– భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టెస్టు మూడో రోజు

21.4 ఓవర్లలో 84/5. వరుస బంతుల్లో జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ను మహ్మద్‌ సిరాజ్‌ సాగనంపగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ దుస్థితి ఇది. బంతిపై మెరుపు ఉండగానే ఐదు వికెట్లు పడగొట్టిన టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో పాటు ఆతిథ్య జట్టును ఫాలోఆన్‌ ఆడించాలనే ఆలోచన చేసింది!. జెమీ స్మిత్‌ (184 నాటౌట్‌), హ్యారీ బ్రూక్‌ (158) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో దండయాత్ర చేశారు. మెరుపు శతకాలు సాధించిన స్మిత్‌, బ్రూక్‌ ఆరో వికెట్‌కు 303 పరుగులు జోడించి భారత్‌ ఆధిక్యాన్ని 180 పరుగులకు కుదించారు.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్‌
ఇంగ్లాండ్‌ బ్యాటర్లు జెమీ స్మిత్‌ (184 నాటౌట్‌, 207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (158, 234 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో కదం తొక్కారు. 84/5తో ఇంగ్లాండ్‌ కష్టాల్లో కూరుకున్న దశలో జతకలిసిన ఈ జోడీ.. బజ్‌బాల్‌ దూకుడుతో ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 368 బంతుల్లో 303 పరుగులు జోడించిన బ్రూక్‌, స్మిత్‌ ఇంగ్లాండ్‌ను ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కించారు. స్మిత్‌, బ్రూక్‌ ధనాధన్‌ సెంచరీలతో అసమాన పోరాటం చేసినా.. మహ్మద్‌ సిరాజ్‌ (6/70) ఆరు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ నడ్డి విరిచాడు. ఆకాశ్‌ దీప్‌ (4/88) సైతం విజృంభించటంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది.
సూపర్‌ సిరాజ్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 77/3తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌కు మహ్మద్‌ సిరాజ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. ఉదయం సెషన్లో రెండో ఓవర్లోనే ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. లెగ్‌సైడ్‌ వ్యూహంతో జో రూట్‌ (22)ను అవుట్‌ చేశాడు. రూట్‌ లెగ్‌ సైడ్‌ ఫ్లిక్‌ చేయగా రిషబ్‌ పంత్‌ ఎడమ వైపునకు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (0) తొలి బంతినే ఎడ్జ్‌ ఇవ్వటంతో పంత్‌ అలవోక క్యాచ్‌ అందుకున్నాడు. టెస్టుల్లో ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్‌ కోల్పోవటం బెన్‌ స్టోక్స్‌ కెరీర్‌లో ఇదే ప్రథమం. ఉదయం సెషన్లో ఏడు పరుగులు జోడించిన ఇంగ్లాండ్‌.. ఇద్దరు కీలక బ్యాటర్లను కోల్పోయింది. 84/5తో టీమ్‌ ఇండియా తిరుగులేని పట్టు సాధించింది. ఈ దశలో ఇంగ్లాండ్‌ కోలుకోవటం కష్టమే అనిపించింది. బ్రూక్‌, స్మిత్‌ భాగస్వామ్యాన్ని ఆకాశ్‌ దీప్‌ విడగొట్టగా.. ఆ తర్వాత సిరాజ్‌ మరో మూడు వికెట్లతో మెరిశాడు. టెయిలెండర్లు బ్రైడన్‌ కార్స్‌ (0), జోశ్‌ టంగ్‌ (0), షోయబ్‌ బషీర్‌ (0)లను సిరాజ్‌ డకౌట్‌ చేశాడు. సిరాజ్‌, ఆకాశ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ చివరి ఐదు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది.
స్మిత్‌, బ్రూక్‌ శతకొట్టారు
సిరాజ్‌ హ్యాట్రిక్‌ వికెట్‌ ముందుండగా.. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్‌ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. పెను తుఫాన్‌కు స్మిత్‌ సంకేతం ఇచ్చినా.. భారత్‌ ఆ ప్రమాదాన్ని పసిగట్టలేదు. వంద పరుగులైనా చేయకుండానే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో స్మిత్‌ భయమెరుగని బ్యాటింగ్‌ ఎంటో చూపించాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన స్మిత్‌.. శతకాన్ని మరింత వేగంగా సాధించాడు. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 బంతుల్లోనే శతక మోత మోగించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్‌ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో హ్యారీ బ్రూక్‌ ఇన్నింగ్స్‌ను ఆచితూచి మొదలెట్టినా.. వేగంగానే స్మిత్‌ను అందుకున్నాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73 బంతుల్లో అర్థ శతకం సాధించిన బ్రూక్‌.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 137 బంతుల్లో సెంచరీ కొట్టాడు. లంచ్‌ సెషన్లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జోడీ.. వికెట్‌ నిరాకరించింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన బ్రూక్‌, స్మిత్‌లు 150 పరుగుల మార్క్‌ను సైతం దాటేశారు. 368 బంతుల్లో 303 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడేసిన జోడీని ఎట్టకేలకు ఆకాశ్‌ దీప్‌ విడగొట్టాడు. బ్రూక్‌ను ఆకాశ్‌ దీప్‌ బౌల్డ్‌ చేయటంతో 387 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. టెయిలెండర్లు వరుసగా పెవిలియన్‌కు చేరినా.. జెమీ స్మిత్‌ అజేయంగా నిలిచాడు.
మళ్లీ వదిలేశారు
మరోసారి భారత ఫీల్డర్లు విలువైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. హ్యారీ బ్రూక్‌ 63 పరుగుల వద్ద ఉండగా జడేజా బౌలింగ్‌లో తొలి స్లిప్స్‌లో ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ గిల్‌ వదిలేశాడు. జెమీ స్మిత్‌ వ్యక్తిగత స్కోరు 90 పరుగుల వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ రిటర్న్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ రెండు కఠినమైన క్యాచ్‌లే అయినా.. నేలపాలు కావటంతో భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 587/10
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రాలీ (సి) నాయర్‌ (బి) సిరాజ్‌ 19, బెన్‌ డకెట్‌ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌ 0, ఒలీ పోప్‌ (సి) రాహుల్‌ (బి) దీప్‌ 0, జో రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 22, హ్యారీ బ్రూక్‌ (బి) ఆకాశ్‌ 158, బెన్‌ స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0, జెమీ స్మిత్‌ నాటౌట్‌ 184, క్రిస్‌ వోక్స్‌ (సి) నాయర్‌ (బి) ఆకాశ్‌ 5, బ్రైడన్‌ కార్స్‌ (ఎల్బీ) సిరాజ్‌ 0, జోశ్‌ టంగ్‌ (ఎల్బీ) సిరాజ్‌ 0, షోయబ్‌ బషీర్‌ (బి) సిరాజ్‌ 0, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (89.3 ఓవర్లలో ఆలౌట్‌) 407.
వికెట్ల పతనం : 1-13, 2-13, 3-25, 4-84, 5-84, 6-387, 7-395, 8-396, 9-407, 10-407.
బౌలింగ్‌ : ఆకాశ్‌ దీప్‌ 20-2-88-4, మహ్మద్‌ సిరాజ్‌ 19.3-3-70-6, ప్రసిద్‌ కృష్ణ 13-1-72-0, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 6-0-29-0, రవీంద్ర జడేజా 17-2-70-0, వాషింగ్టన్‌ సుందర్‌ 14-0-73-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -