Monday, July 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సిర్పూర్–చిల్లపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నీటిమయం

సిర్పూర్–చిల్లపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నీటిమయం

- Advertisement -

వర్షాకాలమే కాదు.. ఎండాకాలంలోనూ నిలుస్తున్న నీరు
జనవరిలో వినతి ఇచ్చినా స్పందించని అధికారులు.. త్వరలో పరిష్కరిస్తామని హామీ
సిర్పూర్–మాలిని రహదారి అధ్వానం.. మూడు గ్రామ పంచాయతీల ప్రజల అవస్థలు
నవతెలంగాణ-సిర్పూర్ (టి)

సిర్పూర్–చిల్లపల్లి గ్రామాల మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైతే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆశ్చర్యకరంగా ఎండాకాలంలో కూడా బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, నీటి పారుదల ఏర్పాట్లు లేకపోవడంతో ఈ సమస్య ఏటా పునరావృతమవుతోంది.

అండర్ బ్రిడ్జి కింద మురుగు, వర్షపు నీరు నిల్వ ఉండటంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి లోతు అంచనా వేయలేక వాహనాలు నిలిచిపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదచారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.

ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు ఈ ఏడాది జనవరి నెలలో రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై రైల్వే అధికారులను వివరణ కోరగా గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అండర్ బ్రిడ్జి వద్ద నీటి నిల్వ సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయం అవసరమని పేర్కొంటూనే, మానవతా దృక్పథంతో సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా సిర్పూర్ నుంచి మాలిని గ్రామం వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. గుంతలు, బురదతో నిండిపోయిన రహదారిపై వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

మూడు గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ఈ రహదారి సమస్యపై సంబంధిత సర్పంచులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడం బాధాకరమని, ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అండర్ బ్రిడ్జి నీటి నిల్వ సమస్యతో పాటు సిర్పూర్–మాలిని రహదారిని శాశ్వతంగా అభివృద్ధి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -