Thursday, February 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరునెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

ఆరునెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల మెరుపు సమ్మె
ప్రధాన గేటు ఎదుట భారీ ధర్నా


నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీటీపీఎస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు ఆరు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కాంట్రాక్ట్‌ కార్మికులు మెరుపు సమ్మె నిర్వహించారు. కాంట్రాక్ట్‌ కార్మికులు సుమారు ఆరు గంటల పాటు బీటీపీఎస్‌ ప్రధాన గేటు ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి మాట్లాడుతూ ఆరు నెలలుగా వేతనాలు లేని కాంట్రాక్ట్‌ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో జీవితాలు వెళ్లదీస్తున్నారని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీటీపీఎస్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నదని, కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు.

జీవో నెంబర్‌ 11 గాని, జీవో నెంబర్‌ 60 గాని అమలు చేయాల్సి ఉండగా వాటికి విరుద్ధంగా వేతనాల చెల్లింపు జరుగుతుందని విమర్శించారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉల్లంఘిస్తున్నారని ఈ విషయంలో బీటీపీఎస్‌ యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికుల అకౌంట్లో జీతాల నుంచి కోత పెట్టినా, ఈఎస్‌ఐలో జమ కావడం లేదని, కాంట్రాక్టర్‌ వాటాను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక మంది కార్మికులకు పీఎఫ్‌ అమలు కావటం లేదని అన్నారు. బూట్లు, హెల్మెట్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన కొద్దిమందికి నాసిరకమైనవి ఇచ్చారని అన్నారు. బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లింపు జరగాలనే నిబంధనను అమలు చేయడం లేదన్నారు. వేతనాల గురించి అడిగితే అక్రమ తొలగింపులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

అధికారుల హామీతో ధర్నా విరమణ
బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న ధర్నా వద్దకు అధికారులను పంపించి చర్చలకు ఆహ్వానించారు. సీఈ ఛాంబర్‌లో ఏడు డిమాండ్లపై చర్చలు జరిపారు. పెండింగ్‌ వేతనాలన్నీ కాంట్రాక్టర్లతో మాట్లాడి సోమవారం లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు విషయంలో ఇప్పటివరకు కార్మికుల వద్ద నుంచి ఎంత డబ్బులు కట్‌ చేశారు. యాజమాన్యం ఎంత వాటా చెల్లించింది, మొత్తం ఎన్ని డబ్బులు అకౌంట్‌ కు జమ అయ్యాయనే విషయాలను ప్రతి కాంట్రాక్టర్‌ తన పరిధిలోని కార్మికులకు లిఖితపూర్వకంగా తెలియజేసే విధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఏ జీవో ప్రాతిపదికన వేతనాలు చెల్లించేది, రోజుకి ఎంత వేతనం, నెలకు ఎంత వేతనం, ప్రతి కాంట్రాక్టర్‌ తన పరిధిలోని కార్మికులకు సమగ్ర వివరాలు అందించే విధంగా బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించే విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

అక్రమ తొలగింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఈ ఆదేశాల మేరకు ఏటీఎం మురళీకృష్ణయ్య, ఎస్‌ఈలు టి.శ్రీనివాసరావు, రమేష్‌ బాబు ధర్నా వద్దకు వచ్చి కార్మికులకు వివరించారు. అధికారుల హామీ మేరకు కార్మికులు, సీఐటీయూ నాయకులు చర్చించి ధర్నా విరమించారు. ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే తిరిగి ధర్నా చేస్తామని సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు, మణుగూరు మండల కన్వీనర్‌ కొడిశాల రాములు, జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, పినపాక మండల కన్వీనర్‌ సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సారిక, బీటీపీఎస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఏ రవి, బిక్షపతి,నాగరాజు, సూర్య, రమేష్‌, స్వరూప కార్మికుల అధిక కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -