అమెరికా జీ20 సదస్సును బహిష్కరించట మంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాల్లో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జీ20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..”సంఘీభావం, సమాన త్వం, సుస్థిరత” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదేండ్లు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్ ట్రంప్ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్ రచ్చచేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జీ20 సమావేశా లకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్ ట్రంప్ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత,బంటూస్థాన్(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే. 1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్న దంటూ ట్రంప్ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి డోనాల్డ్ ట్రంప్ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టివైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్ లాసన్ వ్యాఖ్యానించాడు.
ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో జీ20 ఒకటి. ఇందులో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్, ఆఫ్రికా యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్, స్పెయిన్, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జీ20లోని సభ్యదేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జీడీపీలో 85, అంతర్జాతీయ 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్ పాల్గొన్నాడు.
జీ7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జీ20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభి వృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.
జోహన్నెస్‌బర్గ్ సమావేశానికి ట్రంప్ గైర్హాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఝీక్విన్ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్ ఆర్థికవేత్త జింగ్ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జీ20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్), బ్రెజిల్లో జరిగిన ఐరాస వాతావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్ సమావేశంలో చైనా నేత షీ జిన్‌పింగ్ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునివ్వగా డోనాల్డ్ ట్రంప్ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జీ20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించాడు. రెండు దశాబ్దాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు!
ఎం కోటేశ్వరరావు
8331013288
అమెరికాకు చెంపపెట్టు- 2025 జీ20 సభ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



