Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల ప్రక్షాళన

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల ప్రక్షాళన

- Advertisement -

నీరు, ఇసుక, మట్టి పొరలను గుర్తించాకే పనులు
సర్వే ఫలితాలను బట్టి తదుపరి తవ్వకాలు
టీబీఎం డ్రిల్లింగ్‌ పనులు ఇక లేనట్టే..
రెండేండ్ల టైం బాండ్‌తో పనులు ముందుకు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి

ఎట్టకేలకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టింది. నల్లమల అటవీ ప్రాంతంలో గుట్టలను చీల్చుతూ చేస్తున్న పనుల్లో సొరంగం కూలి 8 మంది కార్మికులు జలదిగ్బంధం అయిన విషయం తెలిసిందే. మూడు నెలలపాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. సొరంగంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఘటనా స్థలాన్ని అత్యంత ప్రమాద స్థలంగా గుర్తించి అక్కడ ఇనుప కంచె ఏర్పాటు చేసి పనులను నిలిపేశారు. ఇకపై కేంద్ర రక్షణ దళాలు, ఆర్మీ, ఎన్‌జీఆర్‌ఫ్‌, హైడ్రా లాంటి నైపుణ్యం కల్గిన సంస్థల సలహాలు సూచనల మేరకు పనులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ మన్నెవారిపల్లి ఔట్‌ సొరంగం దగ్గర ఏరియల్‌ సర్వే నిర్వహణ చేపట్టారు. హెలీ బోర్న్‌ మ్యాగటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే ఫలితాల ఆధారంగా పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం 43.931 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇది పూర్తయితే అతిపెద్ద పొడవాటి సొరంగం ప్రపంచంలోనే మొదటిది అవుతుంది. 20ఏండ్ల కిందట టీబీఎం ద్వారా మొదలుపెట్టిన సొరంగం పనులు అప్పట్లో చారిత్రాత్మకమని చెప్పొచ్చు. 2005లో శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పనులను జయప్రకాస్‌ అసోసియేట్స్‌ సంస్థకు అప్పగించారు. రూ.1925 కోట్లతో 43.931 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 34.371 కిలోమీటర్లు తవ్వారు. ఇంకా 9.56 కిలోమీటర్ల పనులు పూర్తి కావల్సి ఉంది.

ప్రమాదంతో ఆగిన పనులు
తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్‌ సొరంగంలో పనులు ప్రారంభించగా.. మట్టి పెళ్లలు కూలి 8 మంది కార్మికులు జలదిగ్బంధం అయ్యారు. ఆరుగురు కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురాలేకపోయారు. టీబీఎం మిషన్‌ దగ్గర ఇనుప కంచె ఏర్పాటు చేసి ఎవరూ లోనికి వెళ్లకుండా చేశారు. సొరంగం పనులు తిరిగి మొదలు పెడితే ఔట్‌లెట్‌ ద్వారానే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సర్వే ఫలితాలను బట్టి పనులు
హెలీ టోర్న్‌ మ్యాగటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టనున్నారు. భూగర్భంలో 1000 మీటర్ల లోతులో ఏముందో, అనుధార్మిక, మట్టి, ఇసుక, నీరు వంటి పదార్థాల పరిస్థితి సర్వేలో తెలుస్తుంది. డ్రిల్లింగ్‌ చేసే సమయంలో మట్టి నమూనాలు, సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి పనులు చేసే అవకాశాలున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మరో మూడ్రోజుల్లో సర్వే పూర్తి నివేదిక వచ్చే అవకాశముంది.

జాగ్రత్తగా ప్రాజెక్టు పనులు
టన్నెల్‌ పనులు 40 కిలోమీటర్ల మేర కొనసాగాలి. మధ్యలో ఏ చిన్న సాంకేతిక సమస్య వచ్చినా.. కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లు తుంది. గాలి, నీరు, విద్యుత్‌, మట్టితోపాటు గుట్టలో వస్తున్న మార్పుల వల్ల కూడా ప్రాణాపాయం ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

టన్నెల్‌ నుంచి నీరు
అధిక వర్షాల వల్ల నల్లమల గుట్టల నుంచి వచ్చిన నీటితో సొరంగం నిండి.. అక్కడి నుంచి మార్లపాడు గ్రామాన్ని ముంచెత్తింది. సొరంగం పనులు పూర్తయ్యి ఉంటే వరద గ్రామాలకు వచ్చేది కాదు. మార్లపాడుతోపాటు కిష్టపల్లి, మన్నెవారిపల్లి గ్రామాలు సైతం ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ఈ గ్రామాలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి ఇక్కడి నుంచి తరలించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

అరుదైన సొరంగం
ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలో రికార్డు అవుతుంది. 40 కిలోమీటర్ల పొడవు కల్గిన భారీ సొరంగం ఇదే కానుంది. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వుతున్న సొరంగం పనులు పూర్తయి సాగునీరు వస్తే.. ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అవుతుంది. నల్లమల అటవీ సోయగాలతోపాటు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, మిషన్‌ భగీరథ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితోపాటు టన్నెల్‌ పూర్తయితే ఈ ప్రాంతానికి శోభ వస్తుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తాం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత సాగుకు, నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నార. గత పాలకులు 10 ఏండ్లపాటు పనులు చేయకపోవడం వల్ల సొరంగం పూర్తి కాలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను శరవేగంగా పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాం.
– చిక్కుడు వంశీకృష్ణ,అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -