మూడు నెలల కనిష్టానికి పతనం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ రంగాల ఉత్పత్తి ఏకంగా 3 శాతానికి పతనమయ్యింది. బొగ్గు, చమురు, సహజ వాయువు, రిఫైనరీ రంగాలు పేలవ ప్రదర్శనను కనబర్చాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఇంతక్రితం ఆగస్టులో 6.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ తదితర ఎనిమిది రంగాల ఉత్పత్తి 6.3 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వీటి వాటా 42 శాతం పైగా ఉంటుంది. గడిచిన సెప్టెంబర్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు వృద్ధిలో క్షీణతను చవి చూశాయి. ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి మందగించింది. ఉక్కు మాత్రమే మెరుగైన పనితీరును కనబర్చింది. సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 1.2 శాతా నికి పడిపోయింది. ఆగస్టులో ఇది 11.4 శాతంగా ఉంది. దీంతో పోల్చితే భారీగా తగ్గింది. ఇదే నెలలో ముడి చమురు ఉత్పత్తి 2.4 శాతంగా ఉండగా.. గడిచిన సెప్టెంబర్‌లో 1.3 శాతానికి పతనమయ్యింది. సహజ వాయువు ఉత్పత్తి 3.8 శాతానికి తగ్గింది. రిఫైనరీ ఉత్పత్తులు సెప్టెంబర్‌లో 3.7 శాతానికి పడిపోయాయి. ట్రంప్ టారిఫ్‌లతో దేశంలో ఇటీవల పారిశ్రామిక కార్యకలాపాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.