దేశ వ్యాప్తగా అమ్మకాలు డీలా
ద్వితీయ శ్రేణీ నగరాల్లో 10 శాతం పతనం
వైజాగ్‌లో 38 శాతం క్షీణత
టాప్ 15 నగరాల్లోనూ అదే పరిస్థితి
ప్రాప్ ఈక్విటీ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మందగించింది. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల్లో స్తబ్దత చోటు చేసుకోగా.. నివాస అమ్మకాల్లోనూ పతనం చోటు చేసుకోవడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలను బయటపెడుతోంది. అధిక ధరలతో ఆదాయాలు పడిపోవడంతో సామాన్యుడికి ఇండ్ల కొనుగోళ్లు భారంగా మారుతున్నాయి. దీంతో అమ్మకాలు పడిపోయాయని తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ 15 ద్వితీయ శ్రేణీ నగరాల్లో రియల్ ఎస్టేట్ ఆశాభావంగా లేదని పిఇ అనలిటిక్స్ లిమిటెడ్‌లో భాగమైన రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్ ప్లాట్‌ఫామ్ ప్రోప్ ఈక్విటీ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఏడాదికేడాదితో పోల్చితే 2025లో ఇళ్ల అమ్మకాల పరిమాణం 10 శాతం తగ్గి 1.56 లక్షల యూనిట్లకు పడిపోయింది.
విలువ పరంగా యథాతథంగా రూ.1.48 లక్షల కోట్లుగా ఉన్నాయి. మధ్యతరగతికి అందుబాటులో ఉండే కోటి రూపాయల లోపు ఇండ్ల కోనుగోలు తగ్గిపోవడమే ఈ మందగమనానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. నిర్మాణ వ్యయం, భూముల ధరలు పెరగడంతో డెవలపర్లు ఎక్కువగా లగ్జరీ ఇండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు మెట్రో నగరాల బాటలోనే నడుస్తున్నాయి. ఒకవైపు సాధారణ ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నా, రూ.1 కోటి పైబడిన ఇండ్లకు మాత్రం డిమాండ్ పెరగడం విశేషం. ప్రీమియం ఇండ్ల విక్రయాలు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024లో మొత్తం మార్కెట్లో 23 శాతంగా ఉన్న వీటి వాటా.. ఇప్పుడు 28 శాతానికి పెరిగింది.
నగరాల వారీగా..
గతేడాది విశాఖపట్నంలో అమ్మకాలు భారీగా తగ్గాయి. గతేడాది 2025లో అత్యధికంగా 38 శాతం క్షీణించి 2,406 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఈ నగరంలో 3,858 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అహ్మదాబాద్‌లో అమ్మకాలు 8 శాతం తగ్గి 51,148 యూనిట్లుగా నమోదయ్యాయి. సూరత్‌లో 15 శాతం తగ్గి 19,835 యూనిట్లుగా, వడోదర 19 శాతం తగ్గి 13,798 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. మొహాలీలో 34 శాతం పెరిగి 6,118 యూనిట్లుగా, లక్నోలో 6 శాతం వృద్ధితో 4,053 యూనిట్లు చొప్పున నమోదయ్యాయి.
గోవా, కోయంబత్తూరు వంటి నగరాల్లో మార్కెట్ స్వల్ప మార్పులతో స్థిరంగా ఉంది. ‘గత రెండేండ్లుగా ఇండ్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం రూ.1 కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇండ్ల సరఫరా తగ్గిపోవడమే. సాధారణంగా టైర్-2 నగరాల్లో డిమాండ్‌ను పెంచేది ఈ విభాగమే. భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు పెరగడం, కొనుగోలుదారుల ఆకాంక్షలు మారడం వల్ల కొత్త ప్రాజెక్టులు అధిక ధరల విభాగంలోనే లాంచ్ అవుతున్నాయి.” అని ప్రోప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ జసూజా తెలిపారు.



