– నోటీసులు జారీ
– బెంగళూరులో నగదు చెల్లింపుల వైపు మొగ్గు
బెంగళూరు : చిరు, చిన్న వ్యాపారులపై జీఎస్టీ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవల కర్నాటక వాణిజ్య పన్నుల శాఖ చిన్న వ్యాపారులు పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తోంది.. కొన్ని లక్షల రూపాయల పన్ను చెల్లింపు డిమాండ్‌తో చిన్న వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టించారు. ఈ భయాలతో బెంగళూరులోని చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులను వదిలేసి మళ్లీ నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు యూపీఐ క్యూఆర్ స్కానర్లు పక్కన పడేసి, నగదు ఇవ్వాలని వినియోగదారులను కోరుతున్నారు. చాలా షాపుల ముందు ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ‘రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేసి వచ్చే కొద్దిపాటి లాభంతో జీవిస్తున్నాను. నేను ఇకపై యూపీఐ చెల్లింపును అంగీకరించలేను’ అని ఓ దుకాణదారుడు తెలిపాడు. స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, తోపుడు బండ్లు, కార్నర్ షాపులు సహా అధికారికంగా నమోదు కాని వేలాది చిన్న వ్యాపారాలకు జీఎస్టీ నోటీసులు అందాయని వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు పేర్కొంటున్నారు. చాలా మంది విక్రేతలు జీఎస్టీ అధికారుల వేధింపులు, పౌర అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భయపడుతున్నారని ఫెడరేషన్ ఆఫ్ బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినరు కె శ్రీనివాస తెలిపారు. దాంతో చాలామంది ఇప్పటికే కస్టమర్ల నుంచి నగదు కోరుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ.. 2021-22 నుంచి యూపీఐ లావాదేవీల డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే టర్నోవర్ స్థాయులను చేరిన వారికే నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది.
చిరు వ్యాపారులకు జీఎస్టీ అధికారుల వేధింపులు
- Advertisement -
- Advertisement -