Sunday, May 25, 2025
Homeమానవితృణధాన్యాలతో'స్నాక్స్‌బుట్ట'

తృణధాన్యాలతో’స్నాక్స్‌బుట్ట’

- Advertisement -

పద్మ వంగపల్లి… విద్యార్థి దశ నుండే సమాజం పట్ల ఓ స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. బుర్రకథలతో ఎంతో మందిలో చైతన్యం నింపారు. ఆ అనుభవంతో ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ తనేంటో నిరూపించుకున్నారు. మహిళల గొంతుగా మారి ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇలా కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో క్యాన్సర్‌ మహమ్మారి ఆమె జీవితాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆ మహమ్మారిపై యుద్ధం చేసి విజయం సాధించి తనకు ఎంతో ఇష్టమైన వంటల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవలె తృణధాన్యాలతో స్నాక్స్‌బుట్టను ప్రారంభించిన ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
నిజామాబాద్‌లో పుట్టి పెరిగాను. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాను. అమ్మ లలిత, నాన్న శంకర్‌. అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఫుడ్‌ ఓ ప్యాషన్‌గా మారడానికి కారణం అమ్మనే. బొమ్మలు, కుట్లు, అల్లికలు కూడా అమ్మ బాగా చేసేది. ఎం.ఎ, ఎల్‌.ఎల్‌.బి చేశాను. తెలుగు యూనివర్సిటీ నుండి బుర్ర కథలో డిప్లొమా చేశాను. చిన్న ప్పటి నుండి నేను ప్రజా కళాకారిణిని. కంజర కొట్టడం, బుర్రకథ చెప్పడం చాలా ఇష్టం. కాలూరి వెంకటేశ్వరరావు గారు నా గురువు. ఆయన రాసిన నెల్లి మల్ల కాల్పులు, బీడీ కార్మికుల సమస్యలపై బుర్రకథలు చెప్పాను. విద్యార్థి సంఘంలోనూ పని చేశాను.
మొదటి ఆర్‌జెగా…
విద్యార్థి ఉద్యమంలో పని చేసేటపుడు పరిచయమైన రవి కన్నెగంటిని కులాంతర వివాహం చేసుకున్నాను. మాకు ఒక బాబు. బాబుకు నో క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ తీసుకున్నాము. లా చేసి అడ్వకేట్‌గా వెళ్లాలనుకున్నాను కానీ కల్చరల్‌ కార్యక్రమాలపై ఉన్న ఆసక్తితో వెళ్లలేకపోయాను. బాబు పుట్టిన తర్వాత నిజామాబాద్‌ ఆలిండియా రేడియోలో ఆడిషన్స్‌ జరిగితే సెలక్ట్‌ అయ్యాను. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత మెయిన్‌ స్టేషన్‌లో పనిచేశాను. అప్పట్లో ప్రభుత్వం ఎఫ్‌ఎం ప్రారంభించాలనుకుంది. నాకున్న సీనియార్టీ రీత్యా ట్విన్‌ సిటీస్‌ రెయింబోకి మొదటి ఆర్‌జేగా పని చేసే అవకాశం వచ్చింది. అలా 2015 వరకు అనేక టీవీ ఛానల్స్‌లో పని చేశాను.
క్యాన్సర్‌ వల్ల…
2015లో క్యాన్సర్‌ వచ్చింది. దాంతో బాగా ఒత్తిడికి గురయ్యాను. ట్రీట్మెంట్‌ తర్వాత మళ్లీ జాబ్‌లోకి వెళ్లాలంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మావారు వద్దన్నారు. అయితే నాకు మొదటి నుండి వంటల్లో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను. మావారు సెంటర్‌ ఫర్‌ సస్టెన్‌ అగ్రికల్చర్‌(సీఎస్‌ఏ)లో వర్క్‌ చేస్తున్నారు. దాని ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రామాంజనేయులుగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. సీఎస్‌ఏ వారు నిర్వహించే ‘సహజ’ అనే ఆర్గనిక్‌ స్టోర్‌ ఉండేది. అయితే దానికి ప్రాసెసింగ్‌ చేసే ఫుడ్‌ లేదు. అంటే రెడీ టు ఈట్‌, రెడీ టు కుక్‌ ప్రొడక్ట్స్‌ లేవు. వంటల పట్ల నా ఇష్టాన్ని గమనించి ఆ పని నన్ను చూడమని అడిగారు. అయితే మీడియా వదిలి రావడం నాకు ఇష్టం లేదు. వాళ్లకే క్రిషి టీవీ అని కూడా ఉంది. దాన్ని అప్పటి వరకు ఎవ్వరూ హ్యాండిల్‌ చేయలేదు. దాంతో టీవీ, ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ రెండూ చూసుకోవచ్చు కదా అని పిలిచారు. నాకు నచ్చిన పని కూడా ఉంది కాబట్టి సీఎస్‌ఏలో చేరాను.
నన్ను నేను నిరూపించుకోవాలని
టీవీ ఛానల్‌ కోసం ఫీల్డ్‌ కెళ్ళి అనేక స్టోరీలు చేసేదాన్ని. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా కొత్త కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాను. దీని కోసం నలుగురు శ్రామిక మహిళలను నియమించుకున్నాను. ఈ పని నాకు చాలా తృప్తినిచ్చింది. ఇష్టమైన పని కావడంతో అలసట అనేది తెలియకుండా పని చేశాను. మంచి ఆహారాన్ని పది మందికి అందించాలి అనే ఆలోచన నన్ను ఇందులో నిలబెట్టింది. పైగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపన కూడా ఉంది. అక్కడకు వెళ్ళిన తర్వాత చాలా ప్రయోగాలు చేశాను. నా టీంతో కలిసి దాదాపు 60, 70 ప్రోడక్ట్స్‌ వరకు తీసుకొచ్చాను. చాలా వరకు ఇవి ఆర్గానిక్‌ మిల్లెట్స్‌తోనే ఉండేవి. ఏ ప్రయోగం చేయాలన్నా నాకు అన్ని విధాలుగా సహకరించేవారు.
సొంతంగా చేయాలని…
కరోనా తర్వాత నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎస్‌ఏ నుండి బయటకు వచ్చాను. ఆ సమయంలో మా అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. నా పరిస్థితి రీత్యా పూర్తికాలం పని చేసే అవకాశం లేక సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకు న్నాను. ఇప్పుడు ఇండిపెండెంట్‌ జర్నలిస్టుగా వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాను. అలాగే ఏదైనా కొత్త వంటకం చేస్తే ఫేస్‌బుక్‌లో పెడుతుండే దాన్ని. అది చూసి కొందరు మాక్కూడా చేసి పెట్టొచ్చు కదా అనేవారు. సరే ఓ ప్రయత్నం చేద్దామని ‘స్నాక్స్‌ బుట్ట’ ప్రారంభించాను. దీని కోసం లైసెన్స్‌ కూడా తీసుకున్నాను. పూర్తి కాలం పని చేసేందుకు ఇద్దరు అమ్మాయిలు నాతో ఉంటారు. అవసరాన్ని బట్టి ఇంకొందరిని పిలుచుకుం టాను. అయితే వంటల్లో పూర్తిగా ఆర్గానిక్‌ ఏమీ వాడడంలేదు. బెల్లం మాత్రం ఆర్గానిక్‌. పెద్దగా లాభాలు ఆశించకుండా ఎక్కువ మందికి నాణ్యమైన ఫుడ్‌ అందించాలనే ఆలోచనతో మొదలుపెట్టాను.
పిల్లలకు
నచ్చేలా…
తృణధాన్యాలతో చేసిన పదార్థాలు చాలా మంది రుచి ఉండవు అంటారు. అయితే పెద్ద పెద్ద మాల్స్‌లో దొరికే పాకెట్లలో కూడా ఏమీ ఉండవు. కాకపోతే అందులో ఉప్పు, కారం, మసాలాలు వాడటంతో వాటికి రుచి వస్తుంది. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఆరోగ్యమా, రుచినా అనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకే తృణధాన్యాలతో పిల్లలకు నచ్చేలా రుచిగా చేసేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు రాగి, జొన్న, సజ్జలతో లడ్డూలు ఆర్డర్‌ చేసి ఫంక్షన్లలో రిటన్‌ గిఫ్టులుగా ఇచ్చారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రజల్లో ఇలాంటి అవగాహన పెరగడం అవసరం. ఇప్పుడు నాకున్న ఆలోచన పిల్లలు, పెద్దలు, మహిళలకు మంచి ఆహారం అందించడం. దానికోసం స్నాక్స్‌ బుట్టను ఇంకా అభివృద్ధి చేయాలి.
శిక్షణా కార్యక్రమాలు
సీఎస్‌ఏలో పని చేసిన అనుభవంతో మిల్లెట్స్‌ ప్రోడెక్ట్స్‌పై శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 15 బ్యాచ్‌లకు ట్రైనింగ్‌ ఇచ్చాను. ఇది కూడా ఓ కొత్త అనుభవం. గిరిజన, ముస్లిం, దళిత మహిళలకు, ఆర్ఫాన్‌ పిల్లలకు ఇలా రకరకల వారికి ట్రైనింగ్‌ ఇచ్చాను. అయితే ఇలా ట్రైనింగ్‌ తీసుకున్న వాళ్లలో ఎంత మంది ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడ గలుగుతున్నారు అనేది ఓ ప్రశ్న. దీనికి చాలా సపోర్ట్‌ అవసరం. అది ఉంటే మహిళలకు తమను తాము నిరూపించుకునే అవకాశం వుంటుంది. ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో పని చేసేట పుడు మిషన్‌ భగీరధ, యునిసెఫ్‌, లాడ్లీ వంటి గొప్ప అవార్డు తీసుకున్నాను. ఇవన్నీ మీడియాలో ఎంత తృప్తిని ఇచ్చాయో సహజలో కూడా అంతే తృప్తి పొందాను. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే రైతుల నుండి డైరెక్టుగా పంట మా దగ్గర కు వస్తుంది. వాటితో క్వాలిటీ వంటలు తయారు చేసి ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం మా పని.
సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -