– ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్
– మొక్కలు, బిందు సేద్యం పరికరాలకు సబ్సిడీ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నాయని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్ తెలిపారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో ముచ్చటించారు. కమ్మర్ పల్లి మండలంలో ఆయిల్ పామ్ పంట సాగుకి చాలా అనుకూలమైన నేలలు ఉన్నాయన్నారు.ముఖ్యంగా ఈ పంట కొనుగోలుకు దళారీ వ్యవస్థ లేదని తెలిపారు.ఈ పంటను కోసిన 24 గంటల లోపు పంట అమ్మడం పూర్తి అవుతుందన్నారు. గాలివాన, గాలిదుమారం ఏవీ ఈ ఆయిల్ ఫామ్ పంటను ఏమీ చేయలేవని తెలిపారు.
ఏ పంటకి లేని ప్రత్యేకత :
ఏ పంటకు లేని ప్రత్యేకతలు ఆయిల్ ఫామ్ పంటకు ఉన్నాయన్నారు. ఆయిల్ ఫామ్ పంట ప్రత్యేకంగా ఒక చట్టం చేయబడిందన్నారు. ఆయిల్ ఫామ్ పంట అమ్మకం, కొనుగోలు అంతా చట్ట పరిధి ప్రకారం జరుగుతుందని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్ తెలిపారు.మండల కేంద్రంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
4వ సంవత్సరం నుండి పంట దిగుబడి….
ఆయిల్ ఫామ్ పంట దిగుబడి మొక్కలు నాటిన 4వ సంవత్సరం నుంచి మొదలై 35 నుండి 40 సంవత్సరాల వరకు ప్రతి 15 రోజులకీ ఒకసారి దిగుబడి ఇస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగులో మొదటి 3 ఏండ్లు అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చు అన్నారు.మొదటి 4 ఏండ్ల వరకు ఒక ఎకరానికి రూ.4వేల 200 చొప్పున రూ. 16వేల 800 ప్రభుత్వం పెట్టుబడి సహాయ రూపంలో ఇస్తుందని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్ తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటను ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటుకోవచ్చని తెలిపారు.ఆయిల్ ఫామ్ సాగు కోసం రైతులు కట్టిన డిడి రూపాయలను తిరిగి రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.గుంత తీసి మొక్క నాటడం, మొక్క రవాణా ఖర్చుతో పాటుగా 3 ఏండ్ల వరకు ఎరువుల ఖర్చు, మెయింటెనెన్స్ రూపంలో తిరిగి ఇస్తారని తెలిపారు.
రాయితీపై మొక్కలు, బిందు సేద్యం పరికరాలు….
ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు మొక్కలను 90 శాతం ప్రభుత్వ రాయితీతో కేవలం 20 రూపాయలకి ఒక మొక్క చొప్పున అందించడం జరుగుతుంది. ఒక ఎకరానికి 50 మొక్కలు1000 రూపాయలకి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు కోసం బిందు సేద్య పరికరాలు 80-100 శాతం వరకు సబ్సిడి ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఆయిల్ ఫామ్ పంట సాగులో కూలీల అవసరం అంతగా ఉండదన్నారు.మండలంలో ఆయిల్ ఫామ్ పంట వేయదలచిన రైతులు మీ దగ్గరలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారిని గానీ, ఈజీఎస్ ఏపీవోను గానీ, తనను గాని సంప్రదించాలని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్ రైతులకు సూచించారు.
ఆయిల్ ఫామ్ సాగుతూ మంచి లాభాలు: ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి ప్రేమ్ సింగ్
ఆయిల్ ఫామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడి తో దీర్ఘకాలిక రాబడి పొందవచ్చు. పంట సాగులో రైతు శ్రమ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. మొక్కలతోపాటు బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తుంది. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి.ఆయిల్ ఫామ్ పంట సాగులో అవసరమైన సలహాలు సూచనల కోసం 7396667118 ఫోన్ నంబర్ లో సంప్రదించాలన్నారు.