రాష్ట్రంలో 37 గ్రామాల్లో… 23 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే..
రూ.775 కోట్లతో పనులు
మార్చి 31లోపు పూర్తి చేయడమే లక్ష్యం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మెజార్టీ మంత్రుల నియోజకవర్గాల్లోనే మోడల్ సోలార్ గ్రామాలు ఎంపిక కావడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఈ పథకం కింద రాష్ట్రంలో 37 గ్రామాలు ఎంపిక కాగా, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే 23 గ్రామాలు ఎంపిక కావడాన్ని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) పథకం కింద రాష్ట్రంలో 2026 మార్చి 31వ తేదీలోపు 37 మోడల్ సోలార్ గ్రామాల్లో సౌర విద్యుత్ వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో మోడల్ సోలార్ గ్రామాలను ఎంపిక చేశారు. అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలోనే అత్యధిక గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభించడంతో పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం కింద పెద్ద మొత్తంలో మంత్రుల నియోజకవర్గంలోని గ్రామాలనే ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క 23 గ్రామాలను తన నియోజకవర్గంలోని మధిర బోనకల్ మండలంలో ఎంపిక చేయడం చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను ఈ పథకాన్ని సమకూర్చాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద రూ.775 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 40,162 గృహాలకు సౌర విద్యుత్ వసతి కల్పించడంతోపాటు, 16,805 వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్‌నందించే లక్ష్యంతో పనులు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గం మధిరలోని బోనకల్ మండలంలోనే 23 గ్రామాలను ఇందుకు ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం నర్సంపూర్ బి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని గండుగులపల్లి, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, ములుగు జిల్లాలోని జగ్గన్నపేట, హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవపూర్, హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం ఆత్మకూరు (హెచ్), కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలోని రేకొండ, ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం మండలం రఘునాధపాలెం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మ్యాడారం, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేశారు.
సౌర విద్యుత్‌మయం
ఈ పథకం కింద ఎంపికైన మోడల్ సోలార్ గ్రామాల్లో నివాస గృహాలన్నింటికీ సౌర విద్యుత్‌ను అందించనున్నారు. వీధి దీపాలు, మార్కెట్లు, తదితర ప్రభుత్వ స్థలాల్లో సౌర విద్యుత్‌ను అందించనున్నారు. విద్యుత్‌ను పొదుపు చేయడం, విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవడం సాధ్యమవుతుంది. వ్యవసాయ పంప్‌సెట్లకు సైతం సౌర విద్యుత్‌ను ఈ గ్రామాల్లో సరఫరా చేయనున్నారు. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చనున్నారు. అదేవిధంగా వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్యానెల్‌లను అమర్చనున్నారు.
మధిర నియోజకవర్గంలోనే 23 గ్రామాలు..
మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలోని అల్లపాడు, బోనకల్, బ్రాహ్మణపల్లి, చిన్నబీరపల్లి, చిరునోముల, చొప్పకట్టపాలెం బి, గార్లపాడు, గోవిందాపురం ఎ, గోవిందాపురం బి, జానకీపురం, కలకోట, లక్ష్మీపురం బి, మోటమర్రి, ముష్టికుంట్ల, నారాయణపురం, పెద్దబీరవెల్లి, రామాపురం, రాపల్లి, రవినూతల, రామన్నపేట, సీతానాగారం, తూటికుంట్ల గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్ పరిధిలోని ఎల్కతుర్తి మండలానికి చెందిన కేశవాపూర్, చిగురుమామడి మండలంలోని రేకొండ గ్రామాలు కూడా ఎంపికయ్యాయి. గిరిజన జనాభా అత్యధికంగా ఖమ్మం జిల్లాతోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధికంగా ఉన్నా అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే ఈ పథకం కింద పెద్ద ఎత్తున గ్రామాలను ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.



