Thursday, March 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనీయులను వేధించేందుకే

పాలస్తీనీయులను వేధించేందుకే

- Advertisement -

ఇజ్రాయిల్‌కు లైసెన్స్‌ ఇచ్చిన ప్రపంచం
ప్రభుత్వాలు స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి : ఐక్యరాజ్యసమితి నిపుణురాలు ఫ్రాన్సెస్కా ఆల్బనీస్‌ తీవ్ర విమర్శలు
జెనీవా : ప్రపంచదేశాలు మౌనం వహించడం వల్ల ఇజ్రాయిల్‌కు పాలస్తీనియులపై హింస (టార్చర్‌) చేయడానికి పరోక్ష అనుమతి లభించిందని ఐక్యరాజ్యసమితి నిపుణురాలు ఫ్రానెస్కా ఆల్బనీస్‌ ఆరోపించారు. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో అక్కడి ప్రజల జీవితాలు శారీరక, మానసిక బాధలతో నిండిపోయాయని తెలిపారు. యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి కూడా అయిన ఆమె.. ఇజ్రాయిల్‌లో హింస అనేది ప్రభుత్వ విధానంగా మారిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 1967 నుంచి ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితిపై ఆమె యూఎన్‌ మానవ హక్కుల మండలికి తన తాజా నివేదికను సమర్పించారు. ”మీ ప్రభుత్వాలు, మీ మంత్రులు స్పందించకపోవడంతో ఇజ్రాయిల్‌కు పాలస్తీనియులను హింసించడానికి ఒక విధంగా అనుమతి ఇచ్చినట్టయ్యింది” అని ఆమె అన్నారు. ఇప్పటి వరకు గోప్యంగా జరిగే హింస.. ఇప్పుడు బహిరంగంగా జరుగుతోందని తెలిపారు. అవమానం, నొప్పి, మానసిక వేధింపులతో కూడిన ఒక వ్యవస్థ… ఉన్నత రాజకీయ స్థాయిలో ఆమోదం పొందిందని ‘టార్చర్‌ అండ్‌ జెనెసైడ్‌’ పేరుతో ఉన్న నివేదికలో ఆమె పేర్కొన్నారు.

ఈ నివేదిక ప్రకారం.. హింస కేవలం జైళ్లలో లేదా విచారణ గదుల్లోనే పరిమితం కాలేదు. గాజాలో భారీస్థాయిలో ప్రజలు నిరాశ్రయులవడం, ఆహారం, సహాయం నిలిపివేయడం, నిరంతర సైనిక దాడులు, సెట్లర్‌ హింస.. ఇవన్నీ కలిపి పాలస్తీనా ప్రాంతాలను ‘సమూహ శిక్ష స్థలం’గా మార్చాయి. దీంతో ప్రజల జీవన పరిస్థితులు దెబ్బ తిన్నాయి. దీర్ఘకాలిక శారీరక, మానసిక ప్రభావాలు కలుగుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై 2023 అక్టోబర్‌ 7 నుంచి జరిగిన దాడుల్లో కనీసం 72 వేల మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే వెస్ట్‌ బ్యాంక్‌లో 2023 అక్టోబర్‌ నుంచి 18500 మందికి పైగా అరెస్ట్‌లు జరిగాయి. ఇందులో సుమారు 1500 మంది పిల్లలు ఉన్నారు. కాగా యూఎన్‌లో ఇజ్రాయిల్‌ ప్రతినిధులు ఈ నివేదికను ఖండించారు. ఆల్బనీస్‌.. యూఎన్‌ సభ్య దేశాలను ఉద్దేశించి.. హింస, జనసంహారం వంటి చర్యలను అడ్డుకోవాలి, శిక్షించాలి, అంతర్జాతీయ చట్టాలను కాపాడాలి అని పిలుపునిచ్చారు. పాలస్తీనియులపై ఇలాంటి చర్యలను ప్రపంచం సహించటం కొనసాగితే.. అంతర్జాతీయ చట్టాల విలువే కోల్పోతుందని ఆమె హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -