Magazines

మమ్మీ కాదు అమ్మ

1 గంట క్రితం

Not 'mummy', but 'amma'
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 7 నిమిషాల చదవడం

“నీకేం పిచ్చా? ఇదేమిటి ఆఖరి నిముషంలో?” విస్తుపోతూ అన్నాడు ఉదయ్.

మొండిగా కిటికీలోంచి బయటికి చూస్తూ కూచుంది మీనా. “నిన్నే అడిగేది! బుర్ర లేదా? బోలెడు డబ్బు పెట్టి టికెట్లు కొన్నాను. కొన్ని గంటల్లో ప్రయాణం పెట్టుకుని ఇప్పుడు నేను రానంటే అర్థమేమిటి?” గొంతు పెంచుతూ అన్నాడు ఉదయ్.

ఒడిలో పిల్లవాడు ఏడుపందుకున్నాడు. మీనా వాడిని గుండెకు హత్తుకుని సముదాయించే పనిలో పడింది. ఉదయ్ మనసంతా చికాకైపోయింది. పురుళ్ళు రెండూ పూర్తై, ఒంటరితనాలు ముగిసి, పరాయి దేశంలో ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి మీనాతో, పసివాడితో కళకళలాడే ఇల్లు అలవాటై, మళ్ళీ ఒంటరి బతుకంటే ఒక్కసారిగా మనసు కుంగిపోయింది.

కిటికీ బయటికి దృష్టి సారించాడు. ఇంటి ముంగిట్లో చిన్నూగాడు, మేనమామ వాసుతో క్రికెట్ ఆడుతున్నాడు. అదే సందు చివర కావడంతో ఈ ఇంటికీ, ఎదురింటికీ మధ్య ఉన్న జాగా వాడికి చక్కని ఆటస్థలంలా పనికొస్తోంది. అమ్మమ్మగారింట్లో సందడికి బాగా అలవాటుపడి, తన రాకని కూడా వాడసలు పట్టించుకోలేదు. ఇపుడు మీనాకి కూడా అలాగే ఉందా? ఇపుడు తనతో రానంటే ఏమిటర్ధం? పుట్టింట్లో ఎన్నాళ్ళుందామని?

ఇంతలో ఫోను మోగింది. నంబర్ చూసి, లోపల్నుంచి ఉబికి వస్తున్న ఉద్వేగాన్నణుచుకుంటూ, ఫోనెత్తి “అమ్మా, చెప్పు” అన్నాడు.

“అంతా రెడీనా నాన్నా?” అంటూ అటువైపు నుంచి తల్లి పలకరించింది. “ఆ దాదాపు...’’ అటూ ఇటూ కాకుండా అన్నాడు.

ఆ గొంతులోని తేడా పసికట్టేసి “ఏమిట్రా తటపటాయిస్తున్నావు? ఏదైనా తేడా చేసిందా? తల్లీ పిల్లాడూ క్షేమమేనా? పసివాడి ఏడుపు వినిపిస్తోంది?” అంది శ్రావణి ఆదుర్దాగా. వెనకనుంచి నారాయణ రావు ‘నువ్వొకర్తివి! వాళ్లు తయారవుతున్నారు కదా. నువ్వు మధ్యలో ఫోన్ చేసి అంతా రెడీయేనా అనడిగితే వాడేం చెప్తాడు?’ అంటూ విసుక్కోవడం వినిపించింది.

“ఇద్దరూ క్షేమమేలే అమ్మా. నా తిక్క పెళ్ళాం ఇప్పుడే డిసైడ్ చేసుకుంది, తను రాదుట! మరి పిల్లాణ్ణి తనతో ఉంచుకుంటుందో నాతో తీసుకెళ్లి పెంచాలో ఇంకా తేలలేదు” అన్నాడు విసురుగా.

“ఒరేయ్! పిచ్చి వాగుడు వాగకు. మీనా అలా అందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అనునయంగా అడిగి కనుక్కో. నువ్వసలే అభాంద్రా గాడివి. తొందరపాటెక్కువ” అందావిడ ఆందోళన పడుతూ.

“సర్లే, మళ్ళీ చేస్తా” అని ఉదయ్ ఫోన్ పెట్టేశాడు.

కొడుకు పెళ్ళై ఆరేళ్ళయినా, ఆ యువ దంపతులకిద్దరు పిల్లలు పుట్టినా, అడపా దడపా చెవినపడే విడాకుల కేసులు ఆవిడనింకా స్థిమితపడకుండా చేస్తున్నాయి. ‘అసలే తన కొడుకు దుందుడుకు పిల్లాడు. వయసొచ్చినా నిగ్రహం, నిబ్బరం రాలేదు. ఈ కాలం ఆడపిల్లలు తమలాగా అన్నిటికీ సర్దుకుని ఉండడం లేదు. మీనా పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరిగింది. ఇద్దరు తమ్ముళ్లు. స్థితిమంతులైన తల్లిదండ్రుల పెంపకంలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో దేనికీ లోటు లేదన్నట్టు పెరిగిన పిల్ల, కోడలుగా ఎలా ఉంటుందో అని తనెంతో ఆందోళన పడింది. ఇప్పుడంటే వీడు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ బానే సంపాదిస్తున్నాడు గాని పెళ్లినాటికి తమ ఆర్ధికస్థితి కూడా అంతంత మాత్రమే.

పిల్లాడి చదువూ, రూపురేఖలూ చూసి వాళ్లు ఇష్టపడి ముందుకొచ్చారు. పద్ధతిగా పెరిగిన పిల్ల, అందం, కుటుంబం చూసి తామూ వెంటనే సరేనన్నారు. ఇప్పటి పిల్లల్లా ‘అప్పుడే పిల్లలొద్దు’ అనకుండా, పెళ్ళైన ఏడాదికే కడుపుతో ఉందని తెలిసి తనూ భర్తా మురిసిపోయారు. పండంటి మగపిల్లాడు పుట్టాడు. వాడికి మూడేళ్లొచ్చి, ‘ఇంతటితో ఆపేస్తారా, ఇంకోళ్ళని కంటారా?’ అని తన మనసులో ఆలోచన ఉదయించే సమయానికి ‘మీనాకి మూడో నెల’ అని కొడుకు చెప్పిన మాటతో తనకి చెవుల్లో అమృతం పోసినట్టయింది.

ఏడో నెల్లో సీమంతం పెట్టుకుంటే, పిల్లాడితో ఇద్దరూ వచ్చి పుట్టింట్లో, అత్తింట్లో వేడుకలు జరిగాక ఉదయ్ ఒక్కడూ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ బాబు పుట్టి మూడోనెల వెళ్లక ముందే భార్యనీ, పిల్లాడినీ తీసుకువెళ్ళాడు. ఇద్దరినీ సంబాళించడం కష్టమని చిన్నూని అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్తుంటే తన మనసు విలవిలలాడింది గాని, బుజ్జిగాడు మాత్రం తల్లిమీద బెంగ పడకుండా ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ అలవాటు పడిపోయాడు. వాడు ఆడింది ఆట, పాడింది పాట! చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలూ, ఇంట్లో ఇంకా పెళ్లికాని ఇద్దరు మేనమామలూ, అమ్మమ్మా, తాతా, పిల్లవాడిని ఆడించడం కోసమే పెట్టిన రాజమ్మ - అందరికీ వీడే కేంద్ర బిందువు. సమస్త సదుపాయాలూ కాలక్షేపాల మధ్య, నిండు నెలలతోనూ తర్వాత బాలెంతగా పసిపాపాయితోనూ.. బిజీగా అయిపోయిన మీనాని వదిలి అమ్మమ్మనీ, మామయ్యలనీ, తాతనీ అల్లుకుపోయాడు వాడు.

నిజానికి వాడు దుబాయ్‌లో తల్లిదండ్రులతో ఉన్నప్పుడే అమ్మమ్మనీ, అమ్మ పుట్టింటి వాతావరణాన్నీ మిస్సవుతూ ఉండేవాడు. తరచూ ఇక్కడివాళ్ళని తలచుకుంటూ ఉండేవాడు. వీడియోకాల్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటూ, బోలెడు కబుర్లు చెప్పేవాడు. ఫోన్ పెట్టేశాక లోపలి దిగులు ఎందుకో తెలీక తిక్కగా మారాం చేసి ఏడ్చేవాడు. పసివాడితో వెనక్కి వెళ్తూ ఉదయ్, మీనా చిన్నూని అతికష్టం మీద వదిలారు గాని, వాడు మాత్రం అమ్మమ్మింట్లో తేలిగ్గానే ఇమిడిపోయాడు. పిల్లాడి ఆటపాటలన్నీ వీడియో కాల్సులో గమనిస్తూ, వాడు అభినయంతో సహా చెప్పే పసి కబుర్లు వింటూ, ఈ ఆర్నెల్లూ గడిపారు. రోజులో కాసేపు ప్లే స్కూలుకెళ్లొస్తూ వాడు నేర్చుకున్న కొత్త విషయాల కబుర్లతో వాళ్ళ వీడియో కాల్స్ నడిచేవి.

పసివాడి అన్నప్రాశనకి హైదరాబాద్ వచ్చినపుడు చిన్నూని కిండర్ గార్టెన్ స్కూల్లో వేద్దామనీ, వాడి ప్రీప్రైమరీ చదువు పూర్తయ్యేదాకా అమ్మమ్మగారింట్లోనే ఉంచి, చిన్నవాడికి రెండేళ్ళొచ్చాక తీసుకెళ్తే మీనాకి పిల్లలిద్దరినీ చూసుకోవడం కష్టమవదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా కొద్ది గంటల్లో ప్రయాణమనగా మీనా ఇలా ఎందుకందో ఆవిడకి అర్ధం కాలేదు.

ఈ లోపు భోజనాల ఏర్పాటులో ఉన్న మీనా తల్లి శారద “అమ్మలూ, ఒక్కసారి ఈ ఊరగాయలు చూసుకో. పేకింగుకి పంపిస్తున్నా. మళ్ళీ త్వరలోనే వీలునిబట్టి వస్తారుగా. ఎక్కువెక్కువ తీసుకెళ్లే అవసరం లేదు. మోత బరువు. కొరియర్లో పంపుతాంలే అంతగా అవసరమైతే. ఒక్కసారి వచ్చి చూసుకో” అంటూ గుమ్మం దగ్గరకొచ్చి, లోపలి వాతావరణం ఏదో తేడాగా అనిపించి తలుపు దగ్గరే ఆగిపోయింది.

పిల్లాడిని ఊరుకోబెడుతూ అటు తిరిగి ఉన్న కూతురి ముఖ కవళికలు తెలియలేదు గాని, కందిన మొహంతో కోపాన్నణచుకుంటూ నిలుచుని ఉన్న అల్లుడి తీరు అసహజంగా అనిపించి, మెల్లగా “ఏమైంది ఉదయ్?” అనడిగింది.

“చూడండత్తయ్యా! తను రాదుట నాతో. ఇక్కడే ఉండిపోతుందిట. ఇపుడు నన్నొక్కణ్ణే వెళ్ళమంటోంది” ఆవేశంగా అన్నాడు.

తెల్లబోయింది శారద. కాస్త తటపటాయించి ‘‘నేను మాట్లాడనా?’’ అన్నట్టు సైగ చేసింది. చిరాకునణుచుకుంటూ ‘మీ ఇష్టం’ అన్నట్టు భుజాలు కుదించాడు ఉదయ్.

శారద గది లోపల కూతురి దగ్గరకొచ్చి “ఏమైందమ్మా? ఒకర్తెనీ చేసుకోలేనని బెంగ పడుతున్నావా?” అంది అనునయంగా.

తల్లి అలా అడగ్గానే ఒక్కసారిగా బావురుమంది మీనా. శారద కూడా తెల్లబోయి ఒడిలో నిద్రలోకి జారుకున్న బాబుని జాగ్రత్తగా ఎత్తుకుని ఉయ్యాలలో పడుకోబెట్టి వచ్చి, కూతురి పక్కన కూర్చుని దగ్గరకి తీసుకుంది. ‘నా తల్లి కదూ, ఊరుకో’ అంటూ ఆవిడ బుజం నిమురుతూ ‘కాస్త స్థిమిత పడనీ’ అన్నట్టు చూసింది ఉదయ్ వైపు.

మీనా ఏడుపు చూసి నిర్ఘాంతపోయాడు ఉదయ్. తానేమీ అనలేదే? వచ్చినప్పటి నుంచీ అన్నీ సజావుగా జరిగాయి. తమింట్లో పసివాడికి అన్నప్రాశన చక్కగా జరిగింది. బంధుమిత్రులొచ్చి ఆశీర్వదించి వెళ్లారు. పిల్లిద్దరి ముద్దుముచ్చట్లని కళ్లారా చూసుకుంటూ ఇద్దరూ మురిశారు గాని, ఏ గొడవా జరగనూ లేదు. ఏమిటిలా ప్రవర్తిస్తోంది మీనా?

కిటికీ బయట వాసుమామ వేసిన బంతి తిన్నగా వచ్చి బుజ్జిగాడి బాటుకి తగలడం, బంతి వెళ్లి ఇంటి గోడకి తగలడం, ‘అబ్బా, మళ్ళీ ఫోర్ కొట్టేశావురా నాయనా! నువ్వే గెలిచేలా ఉన్నావు’ అంటూ మామ గగ్గోలు పెట్టడంతో- చిన్నూ కితకితలు పెట్టినట్టు నవ్వేస్తున్నాడు. ఇద్దర్నీ చూస్తూ నిలుచున్నాడు ఉదయ్ అస్థిమితంగా. గది లోపల అత్తగారు అనునయిస్తుంటే కారణం లేకుండా ఏడుస్తున్న మీనా తీరు చిరాకుగా ఉంది.

కాసేపలా గడిచింది. మెల్లగా గొంతు సవరించుకుని “ఏం జరిగింది తల్లీ? ఎవరైనా ఏమన్నా అన్నారా?” అంటూ మృదువుగా అడిగింది శారద. మళ్ళీ బోరుమంది మీనా. విసురుగా బయటికి నడవబోయి, ఏం చెపుతుందా అన్నట్టు ఆగిపోయాడు ఉదయ్.

మంచినీళ్ళ కోసం లోపలికొచ్చిన వాసుకి, వారగా తెరచి ఉన్న తలుపులోంచి తల్లీ, అక్కా కనిపించి ఒక క్షణం ఆగాడు. వెనకే వచ్చిన చిన్నూ “అమ్మా! అమ్మా! ఒవ్వొరు గెలిచారో చెప్పుకో!” అంటూ శారద దగ్గరకి పరుగెత్తాడు.

అమ్మమ్మని ‘అమ్మా’ అనీ, తల్లిని ‘మమ్మీ’ అనీ పిలవడం వాడికి అలవాటు. వాడి వెనకే వచ్చిన వాసు గుమ్మం దగ్గర ఆగాడు. పిల్లాడి మాటలు వినపడగానే గబగబా సర్దుకుని కళ్లూ, ముక్కూ తుడుచుకుని, తల్లికి కాస్త దూరం జరిగి సర్దుకుని కూచుంది మీనా. వాడు వాసుమామని ఎలా ఓడించాడో చేతులు తిప్పుకుంటూ చెప్పేసి, మళ్ళీ బయటికి తుర్రుమన్నాడు.

“ఇప్పుడు చెప్పు తల్లీ ఏమయిందో. ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? మీరెళ్లిపోతే మాకూ ఇల్లు బోసిపోతుంది. నా పిల్ల పుట్టింటికొచ్చి, దాని కుటుంబంతో మా దగ్గర ఎన్నాళ్ళున్నా మాకు సంతోషమే గాని మరోటి కాదు. కానీ ఇలా ఏం జరిగిందో కూడా చెప్పకుండా కళ్లనీళ్లు పెట్టుకుంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు?” అంది చెమ్మగిల్లిన కళ్ళతో.

వాసు కూడా లోపలికొచ్చి “ఏమయిందక్కా?” అన్నాడు అయోమయంగా.

మళ్లీ ఉబికి వస్తున్న కళ్ళ నీళ్లు ఆపుకుంటూ “నీకు తెలీదా ఏమయిందో?” అంది విసురుగా.

తెల్లబోయాడు వాసు. అప్పుడే లోపలికొచ్చిన రామారావు అందరూ కూతురి గదిలోనే ఉండడం చూసి గుమ్మం దగ్గర ఆగి లోపలికి చూస్తూ నిలబడ్డాడు.

“నాకు తెలుసా? ఏమిటి తెలుసు?” అడిగాడు వాసు.

శారద కూడా “ఈ డొంకతిరుగుడేమిటమ్మా? చెప్పు, వాడేమన్నా అన్నాడా నిన్ను?” అంది ఓపిక తెచ్చుకుంటూ. వాసు కాదన్నట్టు అడ్డంగా తలూపింది మీనా.

“మరెవరన్నారు?”

“బుజ్జిగాడు..చిన్నూ..” అంది రుద్ధ కంఠంతో.

విస్తుపోతూ “బుజ్జిగాడా? చిన్నూనా? పసివెధవ వాడేమంటాడే నిన్నూ?” అంది శారద.

“ఏమన్నాడో వాడినడుగు” అంది వాసు వైపు చూపిస్తూ.

“ఏమన్నాడురా చంటివాడు? అయినా బొడ్డూడు, ఏదో అంటే దానికి ఏడుస్తారుటే పిచ్చిదానా?” అంది.

“వాడన్నాడని కాదమ్మా. వాడికి నేనలా కనిపించానని ఏడుపొచ్చింది”

మరింతగా ఆశ్చర్యపోతూ “ఏం జరిగిందే. నువ్వూ నీ..” ఏదో అనబోయి మధ్యలో ఆగిపోయింది.

కళ్ళెత్తి తల్లినీ, వాసునీ చూస్తూ “హాల్లో పసివాడు ఉయ్యాలలో ఉన్నాడు కదా ఇందాకా?... చిన్నూ అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. మీరంతా పనిలో ఉన్నారు. బాత్రూంకి వెళ్లాల్సొచ్చి ‘తమ్ముణ్ణి చూస్తూ ఉంటావా, నేనిప్పుడే టూ మినిట్స్‌లో వచ్చేస్తా’ అనడిగాను వాణ్ని. వాడు సరేనని పక్కనే సోఫాలో కూచున్నాడు. తమ్ముడు లేస్తే అమ్మమ్మని పిలవమని చెప్పి వెళ్ళాను” అంటూ ఆగింది.

“అవునూ. నేను లోపలికొచ్చేసరికి కుట్టిగాడు సోఫాలో కూచుని, చెంపకి చెయ్యి పెట్టుకుని ఉయ్యాల్లోకే చూస్తూ ఉన్నాడు. ఎంత ముద్దొచ్చాడో వెధవ. ‘ఏరా కుట్టీ ఏం చేస్తున్నావ్?’ అన్నాను. ‘మమ్మీ వీణ్ణి చూస్తూ ఉండమంది’ అన్నాడు. ‘ఓ అందుకా అలా చూస్తూ కూచున్నావు!’ అంటే ‘అవు’నన్నాడు. అంతే అమ్మా. దాన్లో అక్కకంత బాధ కలిగించిందేమిటో నాకర్ధం కావడం లేదు” అన్నాడు వాసు.

“వాసూ! సగం సగం చెప్పకు. వాడేమన్నాడో పూర్తిగా చెప్పు” అంది మీనా.

“అక్కా! దిసీజ్ టూ మచ్! నాకేం పనే దాచిపెట్టడానికి? వాడన్నది అదే. నువ్వలా రివ్వున లోపలికి పోతే ఏదో మర్చిపోయావేమో అనుకున్నా. వాడన్నదానిలో నీకు కష్టం కలిగేదేముంది? నాకేం అర్ధం కావట్లేదు” ఎర్రబడిన కళ్ళూ, ముక్కూతో వింతగా ఉన్న అక్క మొహం చూస్తూ అన్నాడు.

అంతా మీనా వైపే చూస్తుంటే, తను మాత్రం మొహం పక్కకి తిప్పి “వాడు ‘మమ్మీ చూస్తూ ఉండమం’దనలేదు” అంది.

“మరి?”

“నీకు గుర్తులేదా? ‘వీడి మమ్మీ వీణ్ణి చూస్తూ ఉండమంది’ అన్నాడు! వీడి మమ్మీట! పసివాడికి మాత్రమే నేను అమ్మననుకుంటున్నాడమ్మా వాడు! నేను తనక్కూడా అమ్మనే అని వాడికనిపించలేదు. వాడన్నతీరుకి నాకు గుండెల్లో గుచ్చుకుపోయింది! కొన్నాళ్లకి వాణ్ని కూడా తీసుకునే వెళ్తాను గాని, వాణ్నిక్కడ వదిలేసి వెళ్ళనమ్మా” అంది తడి కళ్లతో ఉదయ్‌ని చూస్తూ.

అసలు సంగతి అర్ధమై, తేలికపడిన మనసుతో “ఓసి నీ ఇల్లు బంగారంగానూ! హడలగొట్టేశావు కదే! దానికేం భాగ్యం? మీ ఆయనకి అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దువులే” అంది శారద.

“ఇకనుంచీ వాడు నన్నే ‘అమ్మా’ అని పిలవాలి. నువ్వు వాడికి అమ్మమ్మవి. నాకీ మమ్మీ గిమ్మీ వద్దు” అంది కళ్ళు తుడుచుకుంటూ. ‘వాడు నన్నెలా పిలిచినా నాకు ముద్దేనే. ఇలా అలవాటు చేసింది నువ్వే కదా’ అనబోయి ఆగిపోయింది శారద.

విషయం అర్ధమవగానే ఫక్కుమని నవ్వాడు ఉదయ్.

“నీకు నవ్వొస్తుంది లే. నిన్ను చక్కగా నాన్నా అంటాడుగా. నీకేం బాధ?” ఉక్రోషంగా అంది మీనా.

తన వరాలమూట తనకి కాకుండా పోతుందేమో, తల్లిగా తను విఫలమైపోతోందేమో అని బెంగపడుతున్న మీనా, కళ్ళూ ముక్కూ ఏకమై తడిసిన మందార మొగ్గలా కనబడింది ఉదయ్‌కి.

రెండుసార్లు పురిటినెప్పులు భరించి, ముద్దులు మూటగట్టే ఇద్దరు పిల్లల్ని కన్న ఆ బంగారు తల్లి ఆటల్లో అలిగిన చిన్నపిల్లలా కనబడింది.

“ఇద్దరూ ఆలోచించుకుని అదేదో తేల్చుకోండి మరి” శారద భర్త వైపూ కొడుకు వైపూ భావగర్భితంగా చూస్తూ బయటకి నడిచింది.

ఆపుకున్నా ఆగని నవ్వుని పెదవి చివరల్లో నిలిపి, ఆ లేతమనసుకి మెత్తని మాట కూడా గుచ్చుకుంటుందో ఏమో అన్నట్టు “అలాగే చేద్దాంలే మీనూ” మృదువుగా అన్నాడు ఉదయ్.

- వారణాసి నాగలక్ష్మి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్