కృత్రిమ మేధస్సుపై భయం కాదు.. బాధ్యతాయుతమైన అవగాహన కావాలి. మనిషి చక్రాన్ని కనిపెట్టినప్పటి నుంచి తన శారీరక శక్తికి యంత్రాన్ని జోడించుకుంటూ వచ్చాడు. ఆవిరి యంత్రం నుంచి విద్యుత్ వరకు, కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ వరకు ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మార్చింది. ఇప్పుడు ఆ ప్రయాణం మరో కీలక మలుపులో నిలిచింది.. కృత్రిమ మేధస్సు, Artificial Intelligence.. AI. కానీ ఈసారి ప్రశ్న కేవలం “ఈ సాంకేతికత మన జీవితాన్ని ఎంత సులభం చేస్తుంది?” అనే ప్రశ్న కాదు, “రేపు ఈ సాంకేతికత మనిషి నియంత్రణలోనే ఉంటుందా?”, “మనిషికి సహాయకారిగా తయారైన మేధస్సే ఏదో ఒకరోజు మనిషికి ప్రమాదంగా మారుతుందా?” అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి.
ఇటీవల Anthropic సంస్థలో పనిచేసిన ఏఐ పరిశోధకుడు Jacob Coxon చేసిన హెచ్చరిక ఈ చర్చను మరింత వేడెక్కించింది. అత్యంత శక్తివంతమైన, తనను తాను మెరుగుపరుచుకునే కృత్రిమ మేధస్సు అభివృద్ధి దిశలో కంపెనీలు భద్రత కంటే పోటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు Anthropicకు చెందిన మరో పరిశోధకుడు Evan Hubinger కూడా భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ఏఐ వల్ల మానవాళికి తీవ్రమైన ప్రమాదం ఉండే అవకాశాన్ని ప్రస్తావించారు. ఇక్కడే ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది “ఏఐ తప్పకుండా మనుషులను చంపేస్తుంది” అనే శాస్త్రీయ నిర్ధారణ కాదు. ఇది భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు మానవ నియంత్రణకు అందకుండా పోయే ప్రమాదంపై ఒక తీవ్రమైన హెచ్చరిక. భయాన్ని పెంచే సోషల్ మీడియా పోస్టులకూ, శాస్త్రీయ హెచ్చరికలకూ మధ్య ఉన్న తేడాను మనం గుర్తించాలి.
అసలు ఏఐ అంటే ఏమిటి?
మనిషి చేసే కొన్ని మేధోపరమైన పనులను కంప్యూటర్ వ్యవస్థలు నిర్వహించగలిగేలా రూపొందించిన సాంకేతికతే కృత్రిమ మేధస్సు. నేర్చుకోవడం, సమాచారాన్ని విశ్లేషించడం, నమూనాలను గుర్తించడం, అంచనాలు వేయడం, నిర్ణయాలకు సహాయం చేయడం వంటి పనులను ఏఐ చేయగలదు. NIST నిర్వచనంలో కూడా ఏఐ అనేది మానవుల మాదిరిగా perception, reasoning, learning, planning, communication వంటి పనులను నిర్వహించగల యంత్రాధారిత వ్యవస్థలుగా వివరించబడింది. ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుతున్న Generative AI మరింత ప్రత్యేకమైనది. మనం ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని కొత్తగా వచనం, చిత్రం, శబ్దం, వీడియో, కంప్యూటర్ కోడ్ వంటి కంటెంట్ను రూపొందించగల ఏఐని Generative AI అంటారు. అంటే మనతో మాట్లాడే ఏఐకి మనిషిలా మెదడు, భావోద్వేగాలు, జీవితం ఉన్నాయని కాదు. అది విస్తారమైన డేటాలోని నమూనాలను నేర్చుకుని మన ప్రశ్నకు సరిపోయే సమాధానాన్ని రూపొందిస్తుంది.
అయితే అది తప్పులు చేయదా?
చేస్తుంది. అదే మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం. ఏఐ తెలివైనదే కానీ సర్వజ్ఞానం కాదు. అది ఇచ్చిన సమాధానం నిజమని భావించి పరిశీలించకుండా స్వీకరిస్తే మనమే తప్పులో పడవచ్చు. ఏఐ తప్పు సమాచారాన్ని నమ్మదగిన భాషలో చెప్పగలదు. పక్షపాతపూరితమైన సమాచారాన్ని కూడా పునరుత్పత్తి చేయగలదు. అందుకే ఏఐని ఉపయోగించే వ్యక్తికి కూడా ఆలోచనా శక్తి, పరిశీలనా దృష్టి అవసరం.
ఇంత ప్రమాదాలున్నప్పుడు ఏఐ ఎందుకు?
ఎందుకంటే దాని ప్రయోజనాలు కూడా అపారమైనవి. వైద్యరంగంలో వ్యాధులను గుర్తించడంలో సహాయం చేయడం, విద్యలో వ్యక్తిగత అభ్యాసానికి తోడ్పడటం, రైతులకు వాతావరణం, పంటలపై సమాచార విశ్లేషణ అందించడం, భాషల మధ్య అనువాదం సులభం చేయడం, వికలాంగులకు సహాయక సాంకేతికత అందించడం, పరిశోధనను వేగవంతం చేయడం, పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచడం, చిన్న వ్యాపారాలకు మార్కెటింగ్, సమాచార సహాయం అందించడం.. ఇలా ఏఐ మనిషి సామర్థ్యాన్ని విస్తరించగలదు. విద్యారంగంలో అయితే దాని ప్రభావం మరింత విస్తృతం. విద్యార్థి తనకు అర్థం కాని అంశాన్ని ఎన్నిసార్లైనా అడగవచ్చు. ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని తయారు చేసుకోవచ్చు. భాషా అవరోధాలను తగ్గించవచ్చు. UNESCO కూడా ఏఐ ద్వారా personalized learning, విద్యకు విస్తృత ప్రాప్యత వంటి అవకాశాలను గుర్తిస్తూనే privacy, safety, inequality, ethics వంటి ప్రమాదాలను కూడా హెచ్చరిస్తోంది. అందుకే సమస్య ఏఐలో లేదు, ఏఐని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదిలో ఉంది. కత్తి వంటగదిలో ఉంటే వంటకు ఉపయోగపడుతుంది. అదే కత్తి హింసకు ఉపయోగిస్తే ప్రమాదం. ఇంటర్నెట్ జ్ఞానానికి గేటు కావచ్చు, అదే ఇంటర్నెట్ మోసాలకు వేదిక కావచ్చు.
ఏఐ కూడా శక్తివంతమైన సాధనమే
శక్తివంతమైన సాధనం ఎప్పుడూ బాధ్యతను కూడా కోరుతుంది. ఇక్కడే Coxon వంటి పరిశోధకుల హెచ్చరికను అర్థం చేసుకోవాలి. ప్రస్తుత ఏఐ మనుషుల్లా స్వతంత్రంగా ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే స్థాయిలో ఉందని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. కానీ ఏఐ మరింత స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ, ఇంటర్నెట్, కంప్యూటర్ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, శాస్త్రీయ పరిశోధన వంటి కీలక రంగాలకు విస్తృత ప్రాప్యత పొందుతున్న కొద్దీ ప్రమాదాల స్వభావం మారవచ్చు. అత్యంత శక్తివంతమైన ఏఐ తన సామర్థ్యాలను తానే మెరుగుపరుచుకునే స్థాయికి వెళితే ఏమవుతుంది? మనిషి ఇచ్చిన లక్ష్యాన్ని అది తప్పుగా అర్థం చేసుకుంటే? మనిషి నియంత్రణను తప్పించుకునే ప్రయత్నం చేస్తే? దానిని దుర్వినియోగం చేసే వ్యక్తుల చేతిలో పడితే? సైబర్ దాడులు, తప్పుడు సమాచారం, నకిలీ వీడియోలు, మోసాలు, గోప్యత ఉల్లంఘనలు వంటి వాటికి ఏఐ ఉపయోగపడితే? ఇవన్నీ ఊహాజనిత భయాలుగా కొట్టిపారేయలేం. ఏఐ భద్రతపై పనిచేస్తున్న సంస్థలే misuse, privacy, misinformation, cybersecurity, biological risks వంటి అంశాలపై safeguards అవసరమని చెబుతున్నాయి. NIST కూడా ఏఐ ప్రయోజనాలను పెంచుతూ దాని ప్రమాదాలను గుర్తించి నిర్వహించడానికి risk-based approach అవసరమని చెబుతోంది. అందుకే అసలు ప్రశ్న.. “ఏఐ మనుషులను చంపుతుందా?” కాదు “మనిషి తయారు చేసిన ఏఐని మనిషి ఎంత బాధ్యతతో నియంత్రిస్తాడు?” అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
యువతకు ఎలా..?
ఇక యువత విషయానికి వస్తే ఏఐ ఒక గొప్ప అవకాశం. అలాగే ఒక ప్రమాదకరమైన ఉచ్చు కూడా. ఒక విద్యార్థి ఏఐని తన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పరిశోధన చేయడానికి ఉపయోగిస్తే అది అతని సామర్థ్యాన్ని పెంచుతుంది. కానీ అదే విద్యార్థి ప్రతి సమాధానాన్ని ఏఐతో రాయించుకుని, పుస్తకం చదవకుండా, స్వయంగా ఆలోచించకుండా, పరీక్షల్లో కూడాఏఐపై ఆధారపడితే.. అప్పుడు ఏఐ అతని మేధస్సును పెంచదు. అతని మేధస్సును అలసత్వానికి గురిచేస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. రేపటి తరం “సమాధానాలు తెలుసుకోవడం” మాత్రమే కాదు, “సరైన ప్రశ్న అడగడం” నేర్చుకోవాలి. ఏఐ సమాధానం ఇచ్చిన తర్వాత “ఇది నిజమేనా?” అని ప్రశ్నించే అలవాటు ఉండాలి. UNESCO ఆధారిత యువత అధ్యయనాల్లో కూడా ఏఐ వల్ల productivity, personalized learning, innovation వంటి ప్రయోజనాలతో పాటు over-reliance, critical thinking తగ్గడం, academic dishonesty, job displacement, misinformation వంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
యువతకు చెప్పాల్సిన మాట ఒక్కటే
ఏఐని మీ మెదడుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి, మీ మెదడుకు సహాయకుడిగా ఉపయోగించండి. ఏఐతో రాయించుకోవడం కంటే ఏఐతో నేర్చుకోవడం గొప్పది. ఏఐతో సమాధానం పొందడం కంటే ఏఐని ప్రశ్నించడం గొప్పది. ఏఐపై ఆధారపడటం కంటే ఏఐని నియంత్రించడం గొప్పది. ఏఐ ఇచ్చిన సమాచారాన్ని నమ్మడం కంటే దాన్ని ధృవీకరించడం గొప్పది.
మరొక పెద్ద సమస్య ఉపాధి
ఏఐ కొన్ని ఉద్యోగాలను తగ్గించవచ్చు. కొన్ని ఉద్యోగాల స్వరూపాన్ని మార్చవచ్చు. అదే సమయంలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చు. గత సాంకేతిక విప్లవాల మాదిరిగానే ఇక్కడ కూడా “ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోతాయా?” అనే ప్రశ్నకంటే “ఉద్యోగాల స్వభావం ఎలా మారుతుంది?” అనేదే ముఖ్యమైన ప్రశ్న. రేపటి ఉద్యోగ మార్కెట్లో కేవలం డిగ్రీ ఉన్నవారికి కాకుండా ఏఐని అర్థం చేసుకుని, తన రంగంలో ఏఐని సమర్థంగా ఉపయోగించగలవారికి ఎక్కువ అవకాశాలు రావచ్చు. అందుకే యువత ఏఐని చూసి భయపడటం కాదు. ఏఐతో పోటీ పడటానికి కాకుండా ఏఐని ఉపయోగించగల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అయితే ఏఐ అభివృద్ధి అందరికీ సమానంగా అందుబాటులోకి రాకపోతే మరో కొత్త అసమానత ఏర్పడే ప్రమాదం ఉంది. అదే AI divide. ఇప్పటికే ప్రపంచ జనాభాలో కోట్లాది మందికి ఇంటర్నెట్ ప్రాప్యత లేదు. సాంకేతికత అందుబాటులో ఉన్నవారు, అందుబాటులో లేనివారి మధ్య ఉన్న అంతరం మరింత పెరగకుండా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, సమాజం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని యునెస్కో స్పష్టం చేసింది. కాబట్టి ఏఐ కేవలం కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉండే సాంకేతికత కాకూడదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి కూడా దీనిపై అవగాహన ఉండాలి. గ్రామీణ యువతకు కూడా డిజిటల్ నైపుణ్యాలు అందాలి. మహిళలు, వికలాంగులు, పేదలు, అణగారిన వర్గాలు కూడా ఈ సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలి. లేకపోతే సాంకేతిక విప్లవం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కొత్త అసమానతలకు కారణమవుతుంది.
గోప్యత మరో పెద్ద ప్రశ్న
మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పత్రాలు, కుటుంబ వివరాలు, ఆర్థిక సమాచారం, వృత్తిపరమైన రహస్యాలు.. ఇవన్నీ ఏఐ సాధనంలో పడితే అక్కడే వదిలేయడం ప్రమాదకరం. “ఏఐకి అన్నీ చెప్పొచ్చు” అనుకోవడం ఎంత తప్పో, “ఏఐ ఏమీ చేయలేడు” అనుకోవడం కూడా అంతే తప్పు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డిజిటల్ నైతికత కూడా అవసరం. పిల్లలకు ఏఐ నేర్పాలి. కానీ ఏఐతో పాటు నిజానిజాల గుర్తింపు నేర్పాలి. సమాచారం ఇవ్వాలి. కానీ సమాచారాన్ని విశ్లేషించే శక్తి కూడా ఇవ్వాలి. సాంకేతిక నైపుణ్యాలు ఇవ్వాలి. కానీ మానవ విలువలు కూడా నేర్పాలి. ఎందుకంటే ఏఐకి వేగం ఉంటుంది. మనిషికి వివేకం ఉంటుంది. ఏఐకి అపారమైన డేటా ఉంటుంది. మనిషికి అనుభవం ఉంటుంది. ఏఐ నమూనాలను గుర్తించగలదు. కానీ ఏది న్యాయం, ఏది అన్యాయం అనే ప్రశ్నకు సమాజం విలువలను నిర్ణయించాలి. ఏఐ భాషను రూపొందించగలదు. కానీ ఆ మాట వల్ల ఒక మనిషి గుండెకు కలిగే బాధను మనిషి మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలడు.
అభివృద్ధికి వేగం అవసరమే...
భవిష్యత్తు “మనిషి వర్సెస్ ఏఐ” కాదు. “మనిషి + ఏఐ” కావాలి. అయితే ఆ “ప్లస్” గుర్తు వెనుక నియంత్రణ మాత్రం మనిషిదే కావాలి. ఏఐ అభివృద్ధిని ఆపేయడం పరిష్కారం కాదు. అదే సమయంలో “సాంకేతిక అభివృద్ధి పేరుతో ఏదైనా అనుమతించాలి” అనడం కూడా ప్రమాదకరం. అభివృద్ధికి వేగం అవసరం. కానీ వేగానికి దిశ కూడా అవసరం. ఆ దిశను నిర్ణయించేది శాస్త్రం మాత్రమే కాదు నైతికత, చట్టం, ప్రజాస్వామ్య నియంత్రణ, మానవ హక్కులు కూడా. ఏఐ అభివృద్ధి చెందాలి. కానీ దాని భద్రతా ప్రమాణాలు కూడా అదే వేగంతో అభివృద్ధి చెందాలి. ఏఐ కంపెనీలు తమ వ్యవస్థల ప్రమాదాలను పారదర్శకంగా వెల్లడించాలి. ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థలను రూపొందించాలి. శాస్త్రవేత్తలు భద్రతా పరిశోధనను వేగవంతం చేయాలి. విద్యాసంస్థలు ఏఐ అధ్యయనాన్ని పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. ప్రజలు ఏఐ సమాచారాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఎందుకంటే రేపటి ప్రపంచాన్ని ఏఐ ఒక్కటే నిర్ణయించదు. ఈరోజు ఏఐని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే రేపటి ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది.
చివరికి ఒక విషయం
మనిషి సృష్టించిన ప్రతి గొప్ప సాంకేతికత మనిషి చేతుల్లోనే గొప్పదిగా మారింది. అదే సాంకేతికత దుర్వినియోగమైతే ప్రమాదంగా మారింది. అందుకే ఏఐని పూజించాల్సిన అవసరం లేదు. చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని ఎవరి చేతిలో పెడుతున్నాం? ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? దాని నిర్ణయాన్ని ఎప్పుడు తిరస్కరించాలి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పగల సమాజాన్ని నిర్మించడమే అసలైన సవాలు. ఏఐ మనిషిని నాశనం చేస్తుందా అనే ప్రశ్నకు ఈరోజు కచ్చితమైన “అవును” లేదా “కాదు” చెప్పడానికి శాస్త్రానికి ఆధారం లేదు. కానీ ఏఐని బాధ్యత లేకుండా అభివృద్ధి చేయడం, దుర్వినియోగం చేయడం, దాని మాటను విచక్షణ లేకుండా నమ్మడం ప్రమాదకరమనే విషయం మాత్రం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి భయంతో వెనక్కి తగ్గకూడదు. అంధమైన ఉత్సాహంతో ముందుకు పరుగెత్తకూడదు. అవగాహనతో అడుగు వేయాలి. వివేకంతో ఏఐని ఉపయోగించాలి. మానవత్వాన్ని కేంద్రంగా ఉంచి సాంకేతికతను నడిపించాలి. ఎందుకంటే చివరికి ప్రశ్న... “ఏఐ ఎంత తెలివైనది?” కాదు. “ఏఐని ఉపయోగించే మనిషి ఎంత వివేకవంతుడు?”.. అదే రేపటి మానవ నాగరికతకు అసలైన పరీక్ష.
పూర్ణిమా యర్రంశెట్టి, 9676439996







కామెంట్లు (0)