కేతిగాడు : రేయ్ జుట్టుపోలుగా.. అడుక్కుంటే వచ్చేది బిచ్చం. పోరాడితే వచ్చేది హక్కు. ఓటు నా జన్మహక్కు. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో భాగంగా నాకు ఓటు హక్కు వచ్చింది. మన అంబేద్కర్ భారత రాజ్యాంగం దాన్ని సుస్థిరపరచింది. ఆ పవిత్ర ఓటును మీ అధికారం కోసం గల్లంతు చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామేంట్రా..? ప్రాణాలు ఫణంగా పెట్టైనా సాధించుకుంటాం. ఒక మనిషి - ఒక ఓటు - ఒక విలువ. పి.ఎం. కైనా.. అంబానీకైనా.. నీ కైనా.. నా కైనా.. అడుక్కునే బిచ్చగానికైనా.. ఒకటే హక్కు - ఓటు హక్కు. అది లాగేసుకుని పౌరుల్ని ప్రాణం లేని బొమ్మల్ని చేద్దామనుకున్నారు. మొత్తం ఎన్నికల కమిషన్ వ్యవస్థనే తొత్తడం చేసినా పల్లెత్తు మాట్లాడరు ఈ జనం అనుకున్నారు కదరా. చూడ్రా.. జెన్.జి. ఏం చేసిందో.. 10వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్‌కు పిలుపిస్తే లక్షలు లక్షల సంఖ్యలో కదిలారు. వార్ని.. మీ బిజెపోళ్లకు జనమన్నా.. నిరసన అన్నా ఎంత భయంరా..? రెండ్రోజులు ముందుగానే సరిహద్దు భద్రతా దళాలను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను, పారామిలటరీ దళాలను, సాయుధ పోలీసుల్ని ఏభై వేలకు పైగా రంగంలోకి దించారు. సిజెపి నేతలను విమానం దిగకుండానే అరెస్టు చేశారు. మామూలు జనాన్ని పదివేలమందికి పైగా నిర్భందించారు. ఎక్కడో పట్టుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి వదిలిపెట్టారు. కేసులు పెట్టారు. అక్కడితో ఆగర్రా మీరు? ఢిల్లీ వచ్చే రైళ్లన్నింటిని ఆపేశారు. మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. ఏం జరుగుతుందో సమాచారం ఎవ్వరికీ తెల్వకూడదని ఇంటర్నెట్ బంద్ చేశారు. వీళ్లే కాక మీ ఆరెస్సెస్ గూండా గాళ్లు ఆడపిల్లలపై దౌర్జన్యం చేశారు. చాలామంది పోలీసుల యూనిఫాంలో దాక్కొని ఆయుధాలు పట్టుకు తిరిగారు. ఉద్యమకారులు దెబ్బలు తిన్నారే తప్ప శాంతి భద్రతలకు ఇసుమంతైనా భంగం కల్గించార్రా? లేదే.. అదిరా గ్రేట్. చూసి నేర్చుకోరా మనిషంటే ఏమిటో? ఉద్యమం అంటే ఏమిటో.. ఓటు అంటే ఏమిటో... ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోరా.. మీ ఢిల్లీ పోలీసులు, హోం మంత్రి అమిత్ షాల యుద్ధ డాంబిక నిర్వాకం చూసి సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ‘‘నిరసన ప్రజాస్వామ్యంలో భాగమే. ఈగను తోలడానికి సుత్తులు వాడమాకండి’’ అని ఎద్దేవా చేసింది. అయినా మీకు బుద్ధి రాలేదు. జనం ఛీ కొడ్తున్నా కుర్చీని పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతున్నార్రా మీరు.
జుట్టుపోలుగాడు : అయిందారా నీ ఉపన్యాసం. మా నాయకుడు ఏం చెప్పాడో నువ్వు వినకపోతే ఎలా? గ్రామాల్లో అస్సలు కాంగ్రెస్ ఏది? ‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ తీస్తే సరా..? అదే దేశం గొంతా..? ప్రజల గొంతా..? ప్రజల గొంతు కొండల్లో కోనల్లో అడవుల్లో పొలాల్లో వుంది. ఈ సర్ 2024లో వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ఓడలేదా? రేపు 2029 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది చూస్కో.
కేతిగాడు : మరి మీ బిజెపి పుట్టినప్పటి నుండి ఎప్పుడూ గెలుస్తూనే వుందా ఏంటి? రాముడి గుడి పేరుతో ఓట్లు దండుకోవడం, మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాసుకోవడం, గుజరాత్ నరమేధాలు జరిపి పబ్బాలు గడుపుకోవడం మీకే చేతనైంది. అయినా మీ పప్పులు ఉడక్కపోవడంతో ఇప్పుడు ఈ ‘సర్’ పట్టుకొచ్చారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు ఇన్నాళ్లకు ఇప్పుడు తగుదునమ్మా అంటూ నోరువిప్పడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియను నిలుపుదల చేయమని 12న మళ్లీ రెండున్నర లక్షలమందితో ఇండియా కూటమి, జెన్‌జీ కలసి ఉమ్మడిగా సుప్రీంకోర్టుకు ఊహించని విధంగా ర్యాలీ తీయడంతో మీకు దిమ్మతిరిగి కళ్లు బైర్లు కమ్మాయి. ఏం చేయాలో అర్థం కాక ఎపిరి తెపిరి మాటలు మాట్లాడుతున్నారు. ‘మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంత మందినైనా అరెస్టు చేయండి. ఏమైనా చేసుకోండి. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా సాగే ఏకోన్ముఖ ప్రజాపోరాటం సిద్దమవుతుంది తెల్సా..?
జుట్టుపోలుగాడు : అరిచింది చాల్లేరా.. అక్కడికి ప్రజాస్వామ్యం మీ సొంతసొత్తులా మాట్లాడతావేంటి? మా మోడీ ఏం చెప్పాడో తెలుసుకోవేం. ప్రజాస్వామ్యానికి భారత్ మాతృభూమి. ఏ విషయమైనా ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా చర్చిస్తారు. భారతదేశంలో వందకు పైగా భాషలున్నాయి. 80వేలకు పైగా పత్రికలు, ఇవిగాక వెయ్యి టెలివిజన్ ఛానల్స్, సోషల్ మీడియా, 50 కోట్ల మంది యూటూబర్లు, మరో 50 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ వాడేవారు. ప్రజలు ఎప్పటికప్పుడు అలా తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పవచ్చు.
బంగారక్క : (ప్రవేశం) అబ్బబ్బబ్బ ఏం చెబితిరి? ఏం చెబితిరి? అందుకేనా.. నిరసనలు చేయకుండా జంతర్‌మంతర్‌ను నిషేధించింది. అవున్లే మహాత్మాగాంధిని చంపిన గాడ్సేను సమర్థించేవారికి మనస్సాక్షి ఎలా వుంటుంది? నిలువెల్లా కాపట్య విషం. జనాన్ని భయపెట్టి లొంగదీసుకోలేం అని నియంతలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఓట్లు చేర్పులు - మార్పులు అనేది సాధారణ విషయం. దాన్ని సర్ పేరుతో సంక్షిష్టం చేసి అధికార కైవసం చేసుకునేలా భారీ కుట్ర పన్నారు. అది కాస్త బెడిసికొట్టింది. పోలింగ్ ఓట్ల లెక్కింపు అక్రమాలు ఇవిఎంల ట్యాపరింగ్తో పాటు ఇప్పుడు ఈ దుర్మార్గ సర్ ప్రక్రియ. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఆయన్ని అటు తొలగించలేక, ఇటు సమర్థించలేక ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది పరిస్థితి. ఇక జనానికి మీ శుష్కవచనాలే గతి.
కె.శాంతారావు, 99597 45723






కామెంట్లు (0)