Magazines

భారత కేంద్ర సచివాలయ గ్రంథాలయానికి తావు లేదా?

1 గంట క్రితం

Central Secretariat Library of India?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 4 నిమిషాల చదవడం

గ్రంథాలయం అంటే నాలుగ్గోడల మధ్య వరుసగా పేర్చిన పుస్తకాల సముదాయం కాదు. అది ఒక దేశపు జ్ఞాపకం. ఒక సమాజపు మేధో సంపద. ఒక తరం నుంచి మరో తరానికి అందే విజ్ఞాన వారసత్వం. గతాన్ని వర్తమానంతో, వర్తమానాన్ని భవిష్యత్తుతో అనుసంధానించే జ్ఞాన వారధి. అలాంటి అపూర్వమైన మేధో సంపదకు నిలయంగా నిలిచిన భారత కేంద్ర సచివాలయ గ్రంథాలయం (Central Secretariat Library–CSL) నేడు తన ఉనికికే సవాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

1891లో బ్రిటిష్ పాలన కాలంలో ‘ఇంపీరియల్ సెక్రటేరియట్ లైబ్రరీ’గా కలకత్తాలో ప్రారంభమైన ఈ గ్రంథాలయం కాలగమనంలో ఢిల్లీకి చేరి, స్వతంత్ర భారతదేశ పరిపాలనా వ్యవస్థకు ఒక విలువైన జ్ఞానభాండాగారంగా ఎదిగింది. నేడు సుమారు 8.5 లక్షల పుస్తకాలు, పత్రాలు, ప్రభుత్వ ప్రచురణలు, అరుదైన గ్రంథాలు, అధికారిక రికార్డులు, గెజిటీర్లు వంటి అపారమైన సమాచార సంపదను తనలో దాచుకున్న ఈ గ్రంథాలయం దేశంలోని ప్రముఖ ప్రభుత్వ గ్రంథాలయాల్లో ఒకటి. ఇది కేవలం పుస్తకాల నిలయం కాదు; భారత పరిపాలనా చరిత్రకు సజీవ సాక్ష్యం.1969 నుంచి శాస్త్రి భవన్‌లో కొనసాగుతున్న ఈ గ్రంథాలయం ప్రస్తుతం వేలాది మంది అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు, మేధావులకు విజ్ఞానాన్ని అందిస్తోంది. మూడు పెద్ద పఠన మందిరాలు, విస్తృతమైన సేకరణలు, వివిధ విభాగాలతో ఇది పరిశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, ఇతర భారతీయ ప్రాంతీయ భాషల గ్రంథాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉండటం మన బహుభాషా, బహుళ సాంస్కృతిక భారతీయతకు ప్రతీక.


Central Secretariat Library of India?ఓ చరిత్ర ఉంది

ఈ గ్రంథాలయంలోని ప్రతి పుస్తకం వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి పత్రం వెనుక ఒక నిర్ణయం ఉంది. ప్రతి నివేదిక వెనుక ఒక విధాన నిర్మాణ ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కమిటీలు, కమిషన్లు, చట్టాలు, గెజిట్ నోటిఫికేషన్లు, పరిపాలనా నివేదికలు వంటి అనేక కీలక పత్రాలు భవిష్యత్ తరాలకు చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయి. అందుకే 1984లో ఈ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వ పత్రాల డెపాజిటరీ లైబ్రరీగా గుర్తించడం దాని ప్రాముఖ్యతను మరింత పెంచింది. కాలానుగుణంగా గ్రంథాలయం డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. 1922 నుంచి 2001 వరకు భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్లను డిజిటైజ్ చేసి ఈ-గెజిట్ వంటి డిజిటల్ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయమైన చర్య. ప్రభుత్వ కమిటీలు, కమిషన్ల చారిత్రక నివేదికలను కూడా డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నాలు జరిగాయి. అయితే డిజిటలైజేషన్ ఎంత అభివృద్ధి చెందినా, భౌతిక గ్రంథాలయాల అవసరాన్ని పూర్తిగా భర్తీ చేయలేం. ముఖ్యంగా అరుదైన పుస్తకాలు, పాత ప్రభుత్వ పత్రాలు, అసలు రికార్డులు, చారిత్రక ప్రచురణలు భౌతిక రూపంలోనే సంరక్షించాల్సిన అవసరం ఉంది.

ఒక జ్ఞాన గని

ఇందులోని ఏరియా స్టడీ డివిజన్ పరిశోధకులకు ఒక జ్ఞాన గనిలాంటిది. 18వ, 19వ శతాబ్దాలకు చెందిన అరుదైన పుస్తకాలు, బ్రిటిష్ కాలపు ప్రభుత్వ ప్రచురణలు, పాత వార్తాపత్రికలు, మైక్రోఫిల్మ్‌లు వంటి విలువైన సంపద ఇక్కడ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్ వంటి పాత పత్రికల సంచికలు కూడా చరిత్రను అధ్యయనం చేసే వారికి అమూల్యమైన ఆధారాలు. రెఫరెన్స్ విభాగం, హిందీ సేకరణ, అధికారిక పత్రాల విభాగం.. ప్రతి విభాగం దేశ జ్ఞాన వారసత్వంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఆర్.కే. పురంలోని శాఖా గ్రంథాలయం కూడా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, విద్యార్థులకు విద్యా సహకారాన్ని అందిస్తోంది. వైద్య, ఇంజినీరింగ్ మినహా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించే అనేక అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. సుమారు 40 వేల హిందీ గ్రంథాల ప్రత్యేక సేకరణ భాషా వైవిధ్యాన్ని గౌరవించే CSL దృక్పథానికి నిదర్శనం.

ఆందోళన కలిగించే విషయం

అంతర్జాతీయ సమాచార పరంగా కూడా ఈ గ్రంథాలయం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల ప్రచురణలు, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల అధికారిక పత్రాలు భారతదేశ విధాన నిర్ణయకర్తలకు అంతర్జాతీయ దృక్పథాన్ని అందిస్తున్నాయి. ఒక

దేశ విదేశాంగ విధానం, ఆర్థిక విధానాలు, సామాజిక కార్యక్రమాలు రూపుదిద్దుకునే క్రమంలో ఇలాంటి సమాచార వనరుల పాత్ర అమూల్యం. ఇలాంటి చారిత్రక జ్ఞాన సంపద ఉన్న గ్రంథాలయానికి సెంట్రల్ విస్టా పునర్వికాస ప్రణాళికలో తగిన స్థలం లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. శాస్త్రి భవన్‌లో వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి కొత్త కర్తవ్య భవన్‌లో చాలా తక్కువ స్థలం కేటాయిస్తే, 8.5 లక్షల పుస్తకాలు, అరుదైన పత్రాలు, పఠన మందిరాలు, సిబ్బంది, పరిశోధనా విభాగాలు, భద్రపరిచే సదుపాయాలు ఎలా సరిపోతాయి? ఇది కేవలం స్థల సమస్య కాదు.. దేశ మేధో సంపద భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.

గౌరవప్రదమైన స్థానం ఉండాలి

ఇటీవల ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గ్రంథాలయానికి కేటాయించిన స్థలం ఎంత? 8.5 లక్షల పుస్తకాలకు అది సరిపోతుందా? ఆర్.కే. పురంలో ఉన్న మరో రెండు లక్షల పుస్తకాల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు కోరింది. ‘విలువైన పత్రాలను సంరక్షించాలి’ అన్న న్యాయస్థాన ఆందోళనలో గ్రంథాలయాల పట్ల సమాజం కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతిధ్వనిస్తోంది. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఎంత అభివృద్ధి చెందినా, జ్ఞానానికి మూలాధారమైన గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేయడం అభివృద్ధి కాదు. డిజిటల్ కాపీ ఉండటం వల్ల అసలు పత్రం విలువ తగ్గదు. ఒక పురాతన గ్రంథాన్ని స్క్రీన్‌పై చూడటం ఒక అనుభవం అయితే, దాని అసలు ప్రతిని సంరక్షించడం మరో తరహా బాధ్యత. చరిత్రను కేవలం డేటాగా కాకుండా వారసత్వంగా చూడాలి. కర్తవ్య భవనాలు ఆధునిక భారత పరిపాలనకు ప్రతీకలుగా నిలవాలంటే, వాటిలో గ్రంథాలయాలకు కూడా గౌరవప్రదమైన స్థానం ఉండాలి. కార్యాలయాలకు విశాలమైన గదులు కేటాయించి, జ్ఞానానికి మాత్రం మూలన చిన్న స్థలం కేటాయించడం అభివృద్ధి భావనకు విరుద్ధం. కర్తవ్యానికి జ్ఞానం అవసరం, జ్ఞానానికి గ్రంథాలయం అవసరం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీకి తగినంత విస్తీర్ణాన్ని మాత్రమే కాకుండా, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అరుదైన గ్రంథాల సంరక్షణ సదుపాయాలు, పఠన మందిరాలు, పరిశోధనా వసతులు, డిజిటల్ ఆర్కైవ్ కేంద్రం, సిబ్బంది కోసం అవసరమైన మౌలిక వసతులను కల్పించాలి. డిజిటల్ వనరులను విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భౌతిక గ్రంథ సంపదను కూడా కంటికి రెప్పలా కాపాడాలి.

135 ఏండ్ల చరిత్ర

భారతదేశం ‘వికసిత భారత్’ వైపు పయనిస్తుందని చెప్పుకుంటున్న ఈ సమయంలో జ్ఞాన సంస్థలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. దేశాన్ని అభివృద్ధి చేసేది కేవలం ఆధునిక భవనాలు కాదు; వాటిలో పనిచేసే మేధస్సు. ఆ మేధస్సుకు బలం ఇచ్చేది విశ్వసనీయమైన జ్ఞాన వనరులు. ఆ జ్ఞాన వనరులకు చిరునామా గ్రంథాలయం. అందుకే కర్తవ్య భవనాల్లో భారత కేంద్ర సచివాలయ గ్రంథాలయానికి తావు ఉండాలి. అది కూడా గౌరవప్రదమైన, సముచితమైన, భవిష్యత్ తరాలకు సరిపడే స్థాయిలో ఉండాలి. 135 ఏండ్ల చరిత్రను మోస్తున్న ఈ జ్ఞానదీపాన్ని ఆరిపోనివ్వకూడదు. దేశ చరిత్రను, పరిపాలనా వారసత్వాన్ని, మేధో సంపదను కాపాడటం మనందరి బాధ్యత. గ్రంథాలయాన్ని కాపాడటం అంటే పుస్తకాలను మాత్రమే కాపాడటం కాదు, దేశ జ్ఞాపకాన్ని, జ్ఞానాన్ని, చరిత్రను, భవిష్యత్తును కాపాడటమే.

డా. రవికుమార్ చేగోని 98669 28327


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్