మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ
నవతెలంగాణ – గోవిందరావుపేట
గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన మండల ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ హాజరై మాట్లాడుతూ మండల కేంద్రంలో మొదటి సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది అని మండలంలోని 18 గ్రామ పంచాయతీ స్థానాల్లో 15 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు మరొకసారి నిలబడి మండలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ మరోమారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యంగా సర్పంచి ఎన్నికల మొదటి విడతలో భాగంగా గోవిందరావుపేట మండల 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో చల్వాయి, కోటగడ్డ, రాఘవపట్నం, కర్లపల్లి మరియు ముత్తాపూర్ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా సర్పంచులుగా నియమితులవగా, ఎన్నికల బరిలో 13 గ్రామ పంచాయతీలు నిలబడగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపి, 10 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. అలాగే గ్రామాల్లో గ్రామ స్థానిక ఎన్నికల సందర్భముగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని, ప్రతి గ్రామంలో ప్రతి హామీని నెరవేర్చి, ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అని అన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ మండలంలోని అతి పెద్ద గ్రామ పంచాయతీలు అయిన చల్వాయి, గోవిందరావుపేట మరియు పసర గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పైన హర్షం వ్యక్తం చేస్తూ, మండలం కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. అలాగే రాబోయే ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అలాగే, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అఖండ మెజారిటీని అందించాలని కోసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, దళిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.



