నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డీఎస్సీ 2024 నియామకాలపై దాఖలైన పిటిషన్‌లో స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. 2024లో 11వేల టీచర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 96 ఎస్‌జీటీ పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. ఈ కేటాయింపులు చట్ట వ్యతిరేకమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండ్లగూడేనికి చెందిన టి.జోత్స్న వేసిన పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ విచారించారు. అక్రమాలపై పున్ణ పరిశీలన చేస్తామని చెప్పిన అధికారులు… ఆ పని చేయలేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. దీనిపై హైకోర్టు, స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదుల జాబితాలో చేర్చి నోటీసు జారీ చేసింది.
పోలీసు నియామకాల కోసం పిటిషన్
రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన కె.అఖిల్ శ్రీ గురుతేజ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఫిబ్రవరి 7నాటికి పోలీసు శాఖలో మంజూరైన 91,169 పోస్టుల్లో 14,935 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో డీజీపీలు 7, అదనపు డీజీపీ పోస్టులు 8, ఎస్సీలు 46, డీఐజీలు 4, సివిల్ కానిస్టేబుళ్లు 9,785, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు 3,548 ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. ఇంకా ఖాళీలు ఏర్పడితే శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దీనిపై గతంలో సుప్రీం కోర్టు తీర్పు మేరకు హైకోర్టు సుమోటోగా విచారణ చేస్తున్నదీ లేనిదీ చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
మెడికల్ అడ్మిషన్‌లపై పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మెడికల్ అడ్మిషన్‌లలో స్థానికతపై దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు బదిలీలపై వెళ్లినపుడు వారికి స్థానిక కోటా వర్తించబోదని తెలిపింది. ఈ మేరకు జీవో 150ను గార్ల మండలం సీతంపేటకు చెందిన తేజస్విణి మరో 33 మంది సవాల్ చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. స్థానికతపై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించినందున ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఏపీలోని కోరుకొండ సైనిక్ స్కూలులో చదివిన శశికిరణ్ అనే అభ్యర్థిని స్థానిక కోటా కింద పరిగణలోకి తీసుకుంటామన్న అడ్వొకేట్ జనరల్ హామీకి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది.
సిరిసిల్ల కలెక్టర్‌కు బెయిల్‌బుల్ వారెంట్
భూసేకరణ పరిహారం చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని సిరసిల్ల జిల్లా కలెక్టర్, భూసేకరణ అధికారికి హైకోర్టు బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేసింది. అక్టోబరు 8న వారిని హాజరుపరిచేలా వారెంట్ జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జిల్లాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన ఎల్లయ్య భూసేకరణ పరిహారం నిమిత్తం వేసిన కేసులో రూ.7.86 లక్షలను 4 వారాల్లో చెల్లించాలని జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అమలు చేయకపోవడంతో వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బుధవారం వారిద్దరూ హాజరుకాకపోవడంతో వచ్చే నెల 8న వాళ్లను హాజరుపరిచేందుకు వీలుగా బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అధికారులిద్దరి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
‘డీఎస్సీ 2024’ కేసులో ప్రతివాదిగా స్పోర్ట్స్ అథారిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES