ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
సభను నడపడం చాతకాదని ఎద్దేవా
కీలక అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ఈ ఎత్తుగడ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆటలేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని నడపడం చాతకాదు కానీ ఆట పోటీలు నిర్వహిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన పద్దులపై చర్చ కొనసాగుతున్న తరుణంలో, ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేదన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇరిగేషన్ వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉందనీ, ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తోందన్నారు.
కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలు ఆడుతుంటే చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారని ఆయన నిలదీశారు. కీలక అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడ వేసిందన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని అన్నారు. పద్దులపై చర్చకు తగినంత సమయం కేటాయించకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని చెప్పారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి…కేవలం ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ జరుగుతుంటే ఆటల పోటీలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



