Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

నేటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో (రెగ్యులర్‌ కోర్సులు మాత్రమే) స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. వాటిలో స్థానికులకే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 17న ఆయా కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్ల వివరాలను దోస్త్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 18,19 తేదీల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను చేపడతారు. స్థానికులతోపాటు స్థానికేతరుల (ఇతర రాష్ట్రాల విద్యార్థులు)కు ప్రవేశాలు కల్పించేందుకు అవకాశమున్నది. ఈనెల 20న ఆ వివరాలను దోస్త్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే స్పాట్‌ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌నకు అనర్హులవుతారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరంలో 967 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 4,38,387 సీట్లున్నాయి. ఇప్పటి వరకు కేవలం 1,96,451 (44.81 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ కాలేజీల్లో ఇంకా 2,41,936 (55.19 శాతం) సీట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) పరిధిలో 830 కాలేజీలుంటే 3,77,907 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 1,69,012 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,08,895 సీట్లు మిగిలే ఉన్నాయి. ప్రముఖ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు ఖాళీగా ఉండడం గమనార్హం. సీట్లు అందుబాటులో ఉండడంతో విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్లలో చేరాలని అధికారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -