Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంమచ్చల జింకలతో 'వన్‌తారా'కు మచ్చ

మచ్చల జింకలతో ‘వన్‌తారా’కు మచ్చ

- Advertisement -

– రిలయన్స్‌ కృత్రిమ అడవిపై వివాదం
– గుజరాత్‌ బన్ని ప్రాంతంలో 20 మచ్చల జింకల్ని వదిలిన వైనం
– అధిక ఉష్ణోగ్రతలతో వాటి మనుగడ కష్టమే
– హేతుబద్ధత ఏంటని ప్రశ్నిస్తున్న పర్యావరణవేత్తలు
– స్థానిక తెగల హక్కులకు భంగం

గాంధీనగర్‌ : గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడువేల ఎకరాల్లో ‘వన్‌తారా’ పేరుతో రిలయన్స్‌ సంస్థ కృత్రిమ అడవిని ఏర్పాటు చేసింది. వన్యప్రాణులు, ఇతర జంతువుల సంరక్షణ పేరుతో దీన్ని స్థాపించారు. అయితే వన్‌తారా చర్యలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని 70 హెక్టార్ల బన్ని పచ్చిక బయళ్ల ప్రాంతంలో ఆ రాష్ట్ర అటవీ విభాగం భాగస్వామ్యంతో వన్‌తారా ఇటీవల 20 మచ్చల జింకలను విడుదల చేసింది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు చాలా వేడిగా ఉంటాయి. నీటి లభ్యతా తక్కువే. ఇలాంటి ప్రాంతంలో మచ్చల జింకలు మనుగడ సాగించలేవని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.

స్థానిక తెగల హక్కుల సంగతేంటి?
బన్నిలో మాల్ధారీ తెగ ప్రజలు జీవిస్తారు. ఇక్కడ ఉండే విశాలమైన పచ్చిక బయళ్ళు వారి పశువులకు మేతగా ఉపయోగపడతాయి. ఈ పశువులే వారికి జీవనాధారం. ఇప్పుడు కొత్తగా మచ్చల జింకలను ప్రవేశపెట్టి, వాటికి అనుకూల వాతావరణ పరిస్థితులు కల్పిస్తే, పరోక్షంగా ఇక్కడుండే తెగలపై ప్రతికూల ప్రభావం పడుతుందనీ, పర్యావరణ సమ తుల్యత దెబ్బతింటుందనేది పర్యావరణవేత్తల అభిప్రాయం. ఇలాంటి చర్యల విషయంలో లోతైన ఆలోచన, శాస్త్రీయ, నైతిక విలువలు అవసరమని ఇక్కడ పనిచేసిన థొరట్‌ చెప్పారు. బన్ని ప్రాంతంలో మచ్చల జింకలను విడుదల చేయటానికి వెనుక ఉన్న శాస్త్రీయ హేతుబద్ధత ఏమిటని ప్రశ్నిస్తూ ‘ది వైర్‌’ వార్తా సంస్థ వన్‌తారా, గుజరాత్‌ అటవీ విభాగాలకు లేఖ రాసింది. దీనిపై వారి నుంచి వివరణ రావాల్సి ఉంది.

ఏమిటీ బన్ని ప్రాంతం?
బన్ని అనేది ఒక పాక్షిక-శుష్క ఎడారి పర్యావరణ వ్యవస్థ. ఇది వాయువ్య గుజరాత్‌లోని కచ్‌లో 2600 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇక్కడ ఎక్కువగా గడ్డి, పొదలు ఉంటాయి. నీల్‌గారు, చింకారా, కృష్ణ జింకలు వంటి శాకాహార జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంతం వాటికి అనువైనది. కానీ మచ్చల జింకలకు మాత్రం ఈ ప్రాంతం సరైంది కాదు. ఇక్కడ అసలు ఆ జంతువులు కనిపించిన దాఖలాలే లేవు. ”మచ్చల జింకలు సహజంగా ఇక్కడ కనిపించవు. ఈ ప్రాంతంలో వీటిని విడుదల చేసే విషయంలో మరింతగా ఆలోచించి ఉండాల్సింది. బన్ని పచ్చికబయళ్ళ కఠిన వేడిని ఇవి తట్టుకోలేవు. ఒకవేళ తట్టుకొని నిలబడినా, అది పర్యావరణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది” అనేది పర్యావరణవేత్తల వాదన.

మచ్చల జింకల ఉనికే లేదు
బన్ని అనేది ఒక వేడిగా ఉండే ప్రాంతం. అక్కడ మచ్చల జింకలు నివసించలేవు. బన్ని పచ్చికబయళ్ళ గురించి అవగాహన ఉన్న ఇద్దరు పర్యావరణవేత్తలు వన్‌తారా చర్యను తప్పుబట్టారు. ఇక్కడ ఉన్న వేడి, పాక్షిక-శుష్క, ఎడారి వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా మచ్చల జింకలు సహజంగా ఇక్కడ కనిపించవని చెప్పారు. ”బన్నిలో ఇన్నేండ్ల కాలంలో నేను ఏ ఒక్క మచ్చల జింకను చూడలేదు, అవి ఉన్నాయన్న ఆధారమూ కనబడలేదు” అని పర్యావరణవేత్త ఓవీ థొరట్‌ అన్నారు. ఆయన 2013-2019 మధ్య బన్నిలో పని చేశారు. అక్కడి పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేశారు. పాక్షిక-శుష్క ఎడారి వ్యవస్థలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతాయనీ, అంతటి కఠినమైన వేడిని తట్టుకొని మచ్చల జింకలు జీవించలేవనేది మరో పర్యావరణవేత్త అభిప్రాయం.

20 మచ్చల జింకలు విడుదల
ఈనెల 15న వన్‌తారాలోకి 20 మచ్చల జింకల్ని (చితల్‌) 70 హెక్టార్లలోని బన్ని పచ్చిక బయళ్ళలోకి విడుదల చేశారు. దీనికి సంబంధించి ‘బన్నిలో జీవవైవిధ్య రక్షణ’ పేరుతో వన్‌తారా ఒక సుదీర్ఘ పోస్టును సామాజిక మాధ్యమంలో పెట్టింది. ఆసియా ఖండంలోనే పెద్దదైన, పర్యావరణపరంగా అత్యంత ముఖ్యమైన బన్ని పచ్చికబయళ్ళ ప్రాంతంలో బయోడైవర్శిటీని బలోపేతం చేయటమే ఈ జాయింట్‌ ప్రాజెక్టు లక్ష్యమని పేర్కొన్నది. బన్ని ప్రాంతంలో మచ్చల జింకలను విడుదల చేయటానికి ముందు గుజరాత్‌ అటవీ విభాగంతో కలిసి క్షేత్రస్థాయిలో సంయుక్తంగా సర్వేచేసి, అంచనా వేశామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -