– అధికారుల చర్యతో రైతు మనస్తాపం..ఆత్మహత్యాయత్నం
– కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘటన
నవతెలంగాణ-గాంధారి
సాగుచేసిన వరి పంటపై అటవీ అధికారులు గడ్డి మందు పిచికారీ చేయడంతో మనస్తాపం చెందిన రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య సుమారు 4 ఎకరాల అటవీ భూమిలో 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ కబ్జాలో ఉన్నాడు. ఎప్పటిలాగే ఆ భూమిలో ఈ సంవత్సరం సైతం మొక్కజొన్న, వరి పంటలను సాగుచేశాడు. అయితే బుధవారం ఉదయం ఫారెస్ట్ అధికారులు వరి పంటపై గడ్డి మందును పిచికారీ చేశారు. దాంతో వారి పంట పూర్తిగా నాశనమైంది. ఫారెస్ట్ అధికారులు చిన్న మల్లయ్యపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా బాధితుడు మల్లయ్య సైతం ఫారెస్ట్ అధికారులపై కంప్లయింట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే మనస్తాపం చెందిన చిన్న మల్లయ్య పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు.. రైతును చికిత్స నిమిత్తం గాంధారిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి జిల్లా ఏరియా ఆస్పత్రికి, అక్కడినుంచి ఎల్లారెడ్డిపేటకు తరలించినట్టు బాధితుని తమ్ముడు కొడుకు శ్రీకాంత్ వెల్లడించారు. కాగా, డబ్బులు ఇవ్వలేదన్న కారణంగానే మల్లయ్య పొలంపై ఫారెస్ట్ అధికారులు గడ్డి మందు పిచికారీ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మండలంలో వేలాది ఎకరాల అటవీ భూముల్లో పంటలు పండిస్తుంటే సప్పుడు చేయని అటవీ శాఖ అధికారులు డబ్బులు ఇస్తే పంట పండించుకో.. లేదంటే గడ్డిమందు పిచికారీ చేస్తామంటూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేస్తాం : ఎఫ్‌ఆర్‌వో హేమ చందన
ఈ విషయమై ఎఫ్‌ఆర్‌ఓ హేమచంద్రను వివరణ కోరగా.. ఇదివరకే రెండు, మూడు సార్లు చెప్పామని.. అయినా వినకుండా మొక్కజొన్న, వరి పంట వేశారని, దాంతో తమ సిబ్బంది గడ్డి మందు పిచికారీ చేశారని తెలిపారు. తాను సెలవుల్లో ఉన్నానని, ఈ విషయం తనకు తెలియదని తెలిపారు. అయితే బాధితుని పూర్తి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసే అంశం పరిశీలిస్తామని వివరించారు.
వరి పంటపై పురుగుల మందు పిచికారీ
- Advertisement -
- Advertisement -