నేటి నుంచి తెలంగాణ రైజింగ్ -2047
విజన్ డాక్యుమెంట్‌పై మేధోమదనం
బేగంపేటలోని ప్రజా భవన్ వేదికగా రూపకల్పన
అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి డిసెంబరు ఏడు నాటికి రెండేండ్లు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో… ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా వచ్చే నెల 8,9 తేదీల్లో చర్చించబోయే ‘తెలంగాణ రైజింగ్, విజన్ డాక్యుమెంట్ -2047’ రూపకల్పనకు సోమవారం నుంచి కసరత్తులు షురూ కానున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ ఇందుకు వేదిక కానుంది. ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, విభాగాధిపతులు విధిగా హాజరు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. డాక్యుమెంట్ రూపకల్పన ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగనుంది. ఆ తర్వాత దానిపై ఒక నివేదికను రూపొందించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేయనున్నారు. ఆయన డిసెంబరు 7న ప్రజల ముందు ఉంచుతారు. దానిపై అదే నెల 8,9 తేదీల్లో చర్చలు, సమాలోచలను ప్రభుత్వం నిర్వహించనుంది.
విజన్ డాక్యుమెంట్‌లో వ్యవసాయ రంగపైన్నే ప్రధానంగా ఫోకస్ ఉండబోతోంది. దాని అనుబంధరంగాలైన పశు సంవర్థక, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమాభివృద్ధి, గ్రామీణ చేతి వృత్తుల బలోపేతంపై నిపుణుల సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. భారీ వర్షాలు, తుపాన్లు, వరదల నేపథ్యంలో అతలాకుతలమవుతోన్న రైతుకు వాటిని తట్టుకునేలా భరోసా కల్పించటం, స్థిరమైన ఆదాయాన్ని అతడికి వచ్చేలా చూడటమనేది తక్షణ కర్తవ్యంగా డాక్యుమెంట్‌లో చేర్చనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కుటీర పరిశ్రమల్లోని వారికి మెరుగైన వేతనాలు ఇప్పించేందుకు వీలుగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టనుంది.
వాటిని డాక్యుమెంట్‌లో పొందుపరచనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డాక్యుమెంట్ రూపకల్పనలో విద్య, వైద్యం, క్రీడలు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మాతాశిశు సంరక్షణ, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించటం తదితరాంశాలను జొప్పించనున్నామని సాధారణ పరిపాలన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అర్బన్ ప్లానింగ్ కూడా అందులో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. విజన్ -2047ను స్వల్ప కాలిక (2025-30), మధ్యకాలిక ((2030-39), దీర్ఘకాలిక (2039-47) అనే మూడు భాగాలుగా విభజించారు.
హై పవర్డ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు…
ప్రస్తుత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, పక్కాగా, పకడ్బందీగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం ఒక హైపవర్‌డ్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆ కౌన్సిల్‌కు సంబంధించిన ఆర్డర్‌ను జులై 25న ఆమోదించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు, ప్రముఖ ఆర్థిక వేత్తలు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, డాక్టర్ రఘురామ్ రాజన్, సామాజిక కార్యకర్త, ఆర్టీఐ యాక్టివిస్ట్ అరుణా రారు, సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత నిపుణురాలు ప్రొఫెసర్ జయతీ ఘోష్, హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది హర్ష మందిర్‌తోపాటు మొత్తం 16 మంది ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ కౌన్సిల్‌కు, ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అందించనుంది.



