పీఆర్సీని 2023 నుంచి అమలు చేయాలి
ఇంటర్ బోర్డు విలీనంపై ఉద్యోగులకు భరోసా కల్పించాలి : ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించేందుకు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుపై కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని కోరారు. రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసులను 2023, జులై ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదన నేపథ్యం లో బోర్డులో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల ప్రయోజనాలకు భరోసా కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటు న్న వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో లచ్చిరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నెలలు గడుస్తున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం లేదనీ, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, కార్యాచరణ ప్రారంభించాలని కోరారు.ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో జేఏసీ భాగస్వామ్య సంఘాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పారు. ఈహెచ్‌ఎస్‌ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో, 191 జీవో సమస్యలను పరిష్కరించాలన్నారు. 25 జీవోను రద్దు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ సంజయ్ జాజులను కలుస్తామని అన్నారు. టీజీసీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ దర్శన్‌గౌడ్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కమిటీ వేయకుండానే సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. మంగళవారం సామూహిక సెలవు కార్యక్రమంలో ఉద్యోగులు స్వచ్చందంగా పాల్గొనాలని చెప్పారు. ఉద్యోగుల జేఏసీ కోచైర్మెన్ ఎస్ రాములు మాట్లాడుతూ నిర్దిష్ట కాలపరిమితితో సీపీఎస్ రద్దుపై కమిటీని వేయాలని అన్నారు. ఎక్కువ ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె హన్మంతరావు, బి కృపాకర్‌రెడ్డి, బాణాల రామిరెడ్డి, షేక్ హబీబ్ మియా, గరికె ఉపేంద్రరావు, రమేశ్ పాక తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)