Magazines

నాపై కక్షను ప్రజలపై చూపకు

16 నిమిషాల క్రితం

MLA Harish Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి రావాలి

కాంగ్రెస్ పార్టీకి రైతులు అంటే పట్టదు :బహిరంగ లేఖలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

నవతెలంగాణ-సిద్ధిపేట

నేను కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించినందుకు.. నాపై కక్ష సాధిస్తున్నారని, నాపై ఉన్న కక్షను నా సిద్దిపేట ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చూపకూడదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హితువు పలికారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నా పొడుగు గురించి... కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడకుండా.. నీవు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయాలని కోరారు. సిద్దిపేట పై పగబట్టి నిధులను ఆపుతున్నాడని, వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1070 కోట్ల నిధులను ఆపించాడని ఆరోపించారు. మొదటిసారి 2024 మే 2న రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించాడని, మూడేండ్లు గడిచినా రుణమాఫీ చెయ్యలేదని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 20,514 మందికి రుణమాఫీ జరిగిందని, 22,819 మందికి రుణమాఫీ కాలేదని అన్నారు. రెండవసారి ఆయిల్ పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈ ఏడాది మార్చి 22న సిద్దిపేటకు వచ్చాడని, 45 రోజులలో రూ.9000 కోట్ల రైతుబంధు డబ్బులను రూ.70 లక్షల మంది రైతులు అకౌంట్లో జమ చేస్తానని చెప్పాడని, 230 రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాలలో ఎందుకు డబ్బులు వేయలేదని ప్రశ్నించారు. ఉత్తం కుమార్ రెడ్డికి సావాస దోషం ఉన్నట్టు ఉందనీ, ముఖ్యమంత్రి లాగానే ఢిల్లీలో అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారనీ, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు నిర్మాణం రాజకీయాల కోసం, కమీషన్ల కోసం మార్చినం అనడం సరికాదన్నారు.

అసెంబ్లీ సాక్షిగా అన్ని ఆధారాలతో మీకు సమాధానం చెప్పాం, మీ నోళ్లు మూయించామని స్పష్టం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, సీడబ్ల్యూసీ రాసిన లేఖలను చూపించామని, నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టులు కడితే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చినట్టు తెలిపారు. నాడు ఏడేండ్లు... నేడు మూడేడ్లు పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారా? కొత్తగా ఒక్క చెరువు తవ్వారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న సిద్దిపేటకు వస్తున్నారని, ప్రజల పక్షాన బహిరంగ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ సిద్దిపేటకు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద్ధి పని జరిగేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు.

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూ‌ళ్లు ...87 నియోజకవర్గాలకు ఇచ్చి సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదని, బ్రేక్ ఫాస్ట్ సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. సిద్దిపేట ఈ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. రిబ్బన్ కట్ చేసి 50 పడకల ఆయూష్ ఆస్పత్రి ప్రారంభించి ఏడాదైనా ఈరోజు వరకు వైద్య సేవలు ప్రారంభం కాలేదన్నారు. భూ నిర్వాసితుల కోసం దీక్షలు చేసిన నీవు, మూడేండ్లుగా భూ నిర్వాసితులకు చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేట సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి, సీఎం కుర్చి పరువు కాపాడాలని, సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడొద్దని, మరోసారి మోసం చేయొద్దని హితువు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఫారుక్ హుస్సేన్, రాజనర్సు, బక్కి వెంకయ్య, రాధాకృష్ణశర్మ, వేణుగోపాల్ రెడ్డి, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్