మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ మార్పు
నెలవారీ పాస్ రూ.8,500 నుంచి రూ.4 వేలకు తగ్గింపు
రేపటి నుంచి అమల్లోకి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజు వారి ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించింది. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు నాలుగు సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది.
అలాగే ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు సర్కారు తగ్గించింది. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి ఇవ్వనున్నారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉండనుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500, సాధారణ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా కానుంది.
8 నుంచి కొత్త ధరలు అమల్లోకి
ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం హైదరాబాద్‌లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.





కామెంట్‌లు (0)