కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జిల్లా కలెక్టర్లు మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం, ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, భూసేకరణ తదితర శాఖలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, కలెక్టర్లు జిల్లాల్లోని విద్యాసంస్థలు, ఆస్పత్రులు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో చోటుచేసుకున్న ప్రమాద సమయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ సకాలంలో స్పందించి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రక్షించిన తీరును ప్రత్యేకంగా అభినందించారు.
తాగునీటి సమస్య తలెత్తకూడదు
ఎల్నినో నేపథ్యంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 565 మండలాల్లో ఆవాసాల వారీగా నీటి ఎద్దడి పరిస్థితులను అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.120 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ వారానికోసారి లేదా పక్షం రోజులకు ఒకసారి సమావేశమై జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా వీబీ-జీ రామ్ జీ పథకం కింద ప్రస్తుతం రోజుకు రికార్డు స్థాయిలో 5.38 లక్షల పనిదినాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. 2024లో రోజుకు 27,100, 2025లో 29,100 పనిదినాలు కల్పించగా, ప్రస్తుతం రోజుకు 5,38,215 పనిదినాలు కల్పిస్తున్నట్లు వివరించారు. 2027 మార్చి నెలాఖరుకు 11 కోట్ల పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఆవాసంలోనూ ఉపాధి పనులు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల సమన్వయంతో వీబీ-జీ రామ్ జీ పనులను చేపట్టాలని సూచించారు.
ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ, అన్ని పనులను వచ్చే జూన్ మాసాంతంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసం లభ్యతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పశుగ్రాసం పెంపకానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. జలసిరి పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్, వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలి
రాష్ట్రంలో చేయూత పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు సంబంధించి మొత్తం 5.9 లక్షల దరఖాస్తులు అందాయని, వీటిలో 38 వేల దరఖాస్తులు మినహా మిగిలిన అన్నింటి పరిశీలన పూర్తయిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా మంజూరు చేసిన 3.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఒక బస్తా సిమెంట్ ధరను రూ.230గా నిర్ణయించినందున, లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మన ఇసుక వాహనం' ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.






కామెంట్లు (0)