Magazines

‌వైద్యారోగ్యశాఖలోని 
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

13 నిమిషాల క్రితం

Contract employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

వంద శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కిందకు తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి

తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఎంఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది సేవలను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏండ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వంద శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సీఎం ప్రజావాణిలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, అధ్యక్షులు ఎమ్‌‌డీ. ఫసియొద్దీన్, ప్రధాన కార్యదర్శి కె. యాదా నాయక్, కోశాధికారి వి. భూలక్ష్మి తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు.

ఎంఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది అనేక ఏండ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారనీ, వారికి తగిన ఉద్యోగ, వేతన భద్రతలేదనీ, ఇతర సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటు న్నప్పటికీ, వారి సర్వీసులను క్రమబద్ధీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నదని వాపోయారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

17 ఏండ్లుగా సేవలందిస్తున్న 17 వేల ఎన్‌‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలనీ, వేతనాలు పెంచి సర్వీసులను క్రమబద్ధీకరించేలా చూడాలని అధికారులను వారు కోరారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందట్లేదనీ, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఎంఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని వివరించారు. ఉద్యోగులకు కనీస వేతనాలు అందించడంతోపాటు ఏటా వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యోగులందరికీ వంద శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వర్తింపజేయాలనీ, డీఏ, హెల్త్‌కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.


ఎంఎన్‌హెచ్‌ ఫార్మసీ ఫెసిలిటీ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలు సవరించాలి

వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎన్‌హెచ్‌ ఫార్మసీ ఫెసిలిటీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. 1933 పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు నియామకాలు పూర్తికాలేదని ఎత్తిచూపారు.

అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ విడుదల విషయంలోనూ జాప్యం జరుగుతున్నదని ప్రస్తావించారు. వెంటనే సెలక్షన్ లిస్ట్‌ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 2023 సంవత్సరంలో నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల నియామక ప్రక్రియను కూడా పూర్తిచేయాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతోపాటు పెండింగ్‌లో ఉన్న నియామకాలను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్