కేటీఆర్, తలసాని సహా పలువురి నేతల ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరని తెలిపారు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు : తలసాని
బషీర్‌బాగ్ సీసీఎస్‌లో దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ పరామర్శించారు. బాలరాజు యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రశ్నించిన బాలరాజ్ యాదవ్ ను అరెస్ట్ చేయడం అక్రమమని ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరని తెలిపారు. బాలరాజు యాదవ్ అరెస్టు అక్రమమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు దేవీప్రసాద్, మేడే రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్, కోలేటి దామోదర్ గుప్తా, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్ ఖండించారు.






కామెంట్‌లు (0)