Magazines

ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం

21 నిమిషాల క్రితం

automotive and EV sectors.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

11న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 
తొలి సమావేశం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రాన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగాల్లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 సన్నాహాల్లో భాగంగా ఆటోమోటివ్, ఈవీ రంగాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, కీలక వాటాదారులు సభ్యులుగా ఉండనున్నారు. ఇప్పటికే సుమారు 25 మంది ప్రతినిధులు కౌన్సిల్‌లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలోని మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులతో నేరుగా చర్చించి తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, నూతన పెట్టుబడి ప్రతిపాదనలు, కంపెనీల విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై చర్చించనున్నారు.

సమావేశం ప్రధాన లక్ష్యాలు:

1. తెలంగాణలో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలను తెలుసుకోవడం.

2. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026తో పాటు నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోలో ప్రముఖ కంపెనీలు చురుకుగా పాల్గొనేలా ఆహ్వానించడం.

3. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలపై పరిశ్రమల ప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించడం.

4. గ్లోబల్ సమ్మిట్‌లో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు సంబంధించి నిర్వహించే ప్రత్యేక చర్చా వేదికల అంశాలను ఖరారు చేయడం.

-5.ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం.

సమన్వయ ఏర్పాట్లు

ఈ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన లాజిస్టిక్స్, సప్లై చైన్, ఆటోమోటివ్, ఈవీ విభాగం డైరెక్టర్ ఔజాద్ షేక్ సంబంధిత బృందాలతో సమన్వయం చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ, పరిశ్రమల శాఖ, మీడియా, కమ్యూనికేషన్స్ విభాగాలు సమావేశానికి తగిన ప్రచారం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆటోమోటివ్, ఈవీ రంగంలో ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పరిశ్రమల ప్రముఖుల భాగస్వామ్యంతో తెలంగాణలో ఈ రంగాల అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం కీలకంగా నిలవనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్