సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తో అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి బృందం భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కీలక ఖనిజ రంగంలో సాంకేతిక, ఉమ్మడి భాగస్వామ్యం, తదితర అంశాలపై హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ కు చెందిన పొలిటికల్, ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ సారథ్యంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థతో పలు వ్యాపార సంబంధ అంశాలు, అవకాశాలపై ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. మైనింగ్ రంగంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించిందని, ఇప్పటికే పలు దేశాలతో ఉమ్మడి భాగస్వామ్యం, సాంకేతిక సహకారంపై చర్చిస్తోందని సంస్థ ఛైర్మెన్ తెలిపారు. దీనిపై అమెరికన్ బృందం వారు స్పందిస్తూ తమ దేశంలో కీలక ఖనిజ రంగంలో ఉన్న పలు సంస్థలతో కలిసి పని చేయడానికి అవకాశాలున్నాయని వివరించారు. సింగరేణి సంస్థ ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ లో దాగి ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అంశాలపై కూడా అమెరికన్ బృందం ఆసక్తి చూపించింది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, సహకారంతో సింగరేణి కీలక ఖనిజ రంగంలో ముందుకువెళ్తోందని సీఎండీ పేర్కొన్నారు. కీలక ఖనిజ రంగంలో విదేశీ పెట్టుబడులను, సాంకేతిక, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని సింగరేణి సంస్థ కోరుతోందని వివరించారు. అమెరికాలో పలు సంస్థలు ఇటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాయని కాన్సులేట్ సభ్యులు తెలియజేశారు ఏప్రిల్ లో అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగరేణిని ఆహ్వానించారు. నేటి ఆధునిక యుగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను శోధిస్తున్నామని, తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో కూడా వీటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అమెరికన్ ప్రతినిధులు తెలిపారు. మూతపడిన ఓపెన్ కాస్ట్ గనులను సద్వినియోగం చేసేందుకు సింగరేణి పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, డాటా సెంటర్లకు పీక్ అవర్స్ లో నిరంతరాయ విద్యుత్ అందించటం కోసం ఈ ప్లాంట్ లు ఉపయోగపడతాయని సింగరేణి అధికారులు వివరించారు. తగిన పెట్టుబడి, భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. సమీపంలో గోదావరి నది నుండి కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు డాటా సెంటర్ లు ఏర్పాటు చేశాయని, మరికొన్ని కంపెనీలు కూడా వీటి ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని.. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు వీటి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు అమెరికన్ కాన్సులేట్ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా చైర్మెన్ అమెరికన్ బృందాన్ని సింగరేణి గనులను, జియో సైన్స్ ల్యాబ్ ను సందర్శించాలని ఆహ్వానించారు.
ఈ సమావేశంలో అమెరికన్ కాన్సులేట్ బృందానికి చెందిన పొలిటికల్, ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్, పొలిటికల్, ఎకనామిక్ స్పెషలిస్ట్ లు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్, సింగరేణి సంస్థ తరఫునచైర్మెన్తో పాటు డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్ మెంట్) కె. రామదాసు, జనరల్ మేనేజర్ (ఎక్స్ ప్లోరేషన్) పంకజ్ కులశ్రేష్ట, జనరల్ మేనేజర్ (పవర్ ప్రాజెక్ట్స్) గురు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)