అక్రమాలకు పాల్పడే కేంద్రాల రిజిస్ట్రేషన్ శాశ్వతంగా రద్దు
బాధ్యులైన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు
సరోగసీ, ఏఆర్‌టీ చట్టాల అమలుపై నిపుణుల కమిటీ : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలకు, దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రయివేటు ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేయాలనీ, అందులో భాగస్వామ్యలైన వైద్యుల లైసెన్స్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిందనీ, తాజాగా అండాల అక్రమ సేకరణకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పట్టుకున్నామని వివరించారు. పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయంతో నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కోఠిలో గల టీజీఎంఎస్‌ఐడీఎస్ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అండాల అక్రమ సేకరణ కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.
ఈ వ్యవహారంలో సంబంధమున్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర విచారణ జరిపి, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వైద్యులపై చర్యల విషయంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ చట్టాల అమలులో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు, రాష్ట్రస్థాయిలో అదనపు నియంత్రణ చర్యలు, మార్గదర్శకాలు రూపొందించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐవీఎఫ్ చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ తయారీ నుంచి అమ్మకాల వరకూ ప్రత్యేకంగా నిఘా ఉండాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు సూచించారు. సంతానలేమి సమస్యతో ఐవీఎఫ్ సేవలను ఆశ్రయించే దంపతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీ, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందు బాటులో ఉన్న సంతాన సాఫల్య చికిత్సా సేవలు పారదర్శకంగా, చట్టబద్ధంగా కొనసాగించేలా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల విస్తరణ చర్యల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.





కామెంట్‌లు (0)