క్రీడల నిర్వహణకు రూ.203.13 కోట్ల రాష్ట్ర బడ్జెట్
శాశ్వత మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
27 క్రీడాంశాల్లో పోటీలు..
7 వేల మందికి పైగా క్రీడాకారుల భాగస్వామ్యం : రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ క్రీడా చరిత్రలో ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ఒక మైలురాయిగా నిలవనున్నాయని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.21 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.203.13 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించిందని తెలిపారు. ఈ నిధులను కేవలం పోటీల నిర్వహణకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని స్టేడియాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని వెల్లడించారు.
తెలంగాణ వేదికగా డిసెంబరు 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అధికారిక లోగో, మస్కట్‌ను ఆదివారం నాడిక్కడ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజరు జాజు, క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, సాట్స్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
‘మత్తు వదలండి.. మైదానాలు చేరండి’.. నినాదంతో ప్రజల్లోకి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు ‘మత్తు వదలండి.. మైదానాలు చేరండి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన నశా ముక్త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా తెలంగాణ క్రీడా ప్రతిభను జాతీయ స్థాయిలో చాటడంతోపాటు, రాష్ట్రంలో క్రీడా రంగానికి శాశ్వత మౌలిక వసతులు కల్పించి భవిష్యత్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
27 క్రీడాంశాల్లో పోటీలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ సంప్రదాయ క్రీడ అయిన కర్రసామును కూడా ఇందులో చేర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా క్రీడాకారులతోపాటు సుమారు 1,200 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొంటారని వివరించారు. హైదరాబాద్‌తోపాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు.







కామెంట్‌లు (0)