Magazines

గుడిసెలో జాతీయ విజేత

1 గంట క్రితం

Champion
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

పతకం సాధించినప్పుడు భుజం తట్టి..

ఇప్పుడు ముఖం చాటేసిన పాలకులు


నవతెలంగాణ-ఇనుగుర్తి ​
పతకం సాధించినప్పుడు భుజం తట్టిన వాళ్లే, ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్నప్పుడు మర్చిపోయారు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం మీట్యా తండా పరిధిలోని మర్రికుంట తండా కు చెందిన గుగులోత్ సురేష్ పరిస్థితి ఇది. బేస్ బాల్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి, 2019-20లో థాయ్ లాండ్ లో జరిగిన జూనియర్ నేషనల్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు తరఫున ఆడి విజయం సాధించిన జాతీయ క్రీడాకారుడు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. 2022లో తండ్రిని కూడా కోల్పోయాడు. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు తండ్రిలా నిలబడి వారి పెళ్లిళ్లు చేసి అప్పులపాలయ్యాడు. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి, ఇష్టమైన క్రీడకు దూరమై ఇప్పుడు సిమెంట్ పని చేస్తూ బతుకీడుస్తున్నాడు. ప్రస్తుతం భార్యతో కలిసి మీట్యా తండాలో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నాడు. రాత్రి వర్షం వస్తే నిద్ర ఉండదు, గుడిసెలో నీళ్లు కారుతుంటే పక్కింట్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. పగలు పని లేకపోతే తిండి ఉండదు. గ్రామస్తులు చెబుతున్నది ఒక్కటే - సురేష్ కు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండని. అధికారులు ఫైళ్లలో కాకుండా, తండాకు వచ్చి సురేష్ గుడిసె చూస్తే వాస్తవం తెలుస్తుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారుడికి గూడు కల్పిస్తే, తండాలోని యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాడని గ్రామస్తులు, తండావాసులు ఆశిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్