నల్లగొండ వేదికగా నాలుగు రోజుల పాటు మహాసభలు
15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ :
పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ వేదికగా నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను, నవంబర్ 15న నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. మహాసభల పోస్టర్‌ను సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ముందుగానే ఊరూవాడా జాతరలా మహాసభల ప్రచారం నడుస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలు, కార్పొరేట్ శక్తుల విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత పన్నెండేళ్లలో అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్‌తో దిగుమతి చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని అన్నారు. రైతాంగ హక్కుల పరిరక్షణకు, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేందుకు దేశవ్యాప్తంగా రైతులను ఐక్యం చేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. 1936 ఏప్రిల్ 11న లక్నోలో సామ్రాజ్యవాదం, వలసపాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థ రద్దు, రైతుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి 90 ఏళ్లుగా రైతుల పక్షాన అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభల్లో విదేశీ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించే అంశంపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. మహాసభల ప్రారంభ సూచికగా నవంబర్ 15న నల్లగొండ పట్టణంలో లక్ష మంది రైతులతో నిర్వహించనున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని రైతులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాలు, రైతు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఎం. సుబ్బారావు, కళ్యాణ వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్.కె. మీరా, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, పడగల నాగేశ్వరరావు, నామా లక్ష్మీనారాయణ, రెడపంగి ప్రకాష్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)