Magazines

పంట పండించినా గుర్తింపేది?

25 నిమిషాల క్రితం

Even after growing a crop, where is the recognition?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 3 నిమిషాల చదవడం

కౌలు రైతుల కన్నీటి గాథ

దక్కని ప్రభుత్వ సాయం

పాస్‌బుక్ ఉంటేనే రైతుగా గుర్తింపు..

అడ్డంకులుగా మారిన 
ప్రభుత్వ విధానాలు

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ ​భూమి ఒకరిది.. చెమట మరొకరిది.. పెట్టుబడి ఒక్కరిది కాదు.. పంట పండించేది మాత్రం కౌలు రైతు.. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికొచ్చే వరకు అప్పులు చేసి, కుటుంబాన్ని పణంగా పెట్టి సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ విధానాలు అడుగడుగునా అడ్డంకులుగా మారుతున్నాయి. పంట పండించినా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే హక్కు లేదు.. పండించిన ధాన్యానికి సొంత ఖాతాలో డబ్బులు జమ కావు.. ఎరువులు, విత్తనాలు పొందాలన్నా భూ యజమాని పాస్‌బుక్, ఓటీపీ తప్పనిసరి. సాగు చేసేది కౌలు రైతులైనా.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం భూమి యజమానులే రైతులుగా మిగులుతున్నారు.

​తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల మందికి పైగా కౌలు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న భూముల్లో సుమారు 70 శాతం కౌలు రైతుల ఆధారంగా సాగు జరుగుతున్నట్టు రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. భూములున్న మధ్యతరగతి, ధనిక రైతులు ఉద్యోగాలు, వ్యాపారాల వైపు వెళ్లడంతో పేద, సన్నచిన్నకారు రైతులే కౌలుకు సాగు చేస్తున్నారు. అయితే సాగు చేస్తున్న వారిని రైతులుగా గుర్తించేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో వారికి సంక్షేమ పథకాలు, పంట కొనుగోళ్లు, ఎరువుల సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో తీసుకొచ్చిన కౌలుదారుల గుర్తింపు చట్టం ద్వారా కల్పించిన అవకాశాలు సైతం క్రమంగా కనుమరుగవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని రైతుసంఘాలు కోరుతున్నాయి.

​ 2011 చట్టంతో గుర్తింపు.. నేడు గాలికి!

​ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలపై రైతు సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా 2011లో అప్పటి ప్రభుత్వం కౌలుదారుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులు జారీ చేసే అవకాశం కలిగింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందడంతోపాటు పంటను విక్రయించుకోవడానికి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఈ కార్డులు ఉపయోగపడ్డాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కౌలు రైతులకు మరింత మెరుగైన ప్రయోజనాలు అందుతాయని ఆశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించాలంటే రైతు పాస్‌బుక్ తప్పనిసరి చేశారు. భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతు పండించిన ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. కౌలు రైతుగా గుర్తింపు లేకపోవడంతో మధ్య దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తోంది.

​కష్టపడేది కౌలు రైతు.. ఖాతాలో పడేది యజమానికి!

​కౌలు రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా, పంట డబ్బులు నేరుగా అతని బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. భూమి పాస్‌బుక్కు ఎవరి పేరుతో ఉంటే వారి ఖాతాలోనే నగదు జమ అవుతోంది. దీంతో తన కష్టార్జితాన్ని తిరిగి భూ యజమాని నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనూ పాస్‌బుక్కు ఆధారంగానే రైతు వివరాలను ట్యాగింగ్ చేసి యాప్‌లో నమోదు చేస్తున్నారు.

పంట పండించినా గుర్తింపేది?

​ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ విధానం కౌలు రైతులకు మరో సమస్యగా మారింది. కాంప్లెక్స్ ఎరువులు, యూరియా పొందాలంటే భూమి పాస్‌బుక్కు ఆధారంగా వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో కౌలు రైతులకు ఎరువులు సక్రమంగా అందడం లేదు. కొన్నిచోట్ల అరకొరగా మాత్రమే లభిస్తున్నాయి. యాప్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియక రాత్రి వేళల్లోనూ రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది.

​​ కౌలు రైతులను గుర్తించాలి.. యాప్ విధానం రద్దు చేయాలి

​కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి. ముఖ్యంగా కౌలు రైతులు, పేద సన్న, చిన్నకారు రైతులు, అక్షరజ్ఞానం లేని రైతులు యాప్ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల సరఫరాలో పాస్‌బుక్కు నిబంధనలను సడలించాలి. యాప్ విధానాలను రద్దు చేసి సాగు చేస్తున్న రైతులందరికీ నేరుగా వ్యవసాయ అవసరాలు అందించాలి.

రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్