నవంబర్ 11నుంచి13 వరకు మానవహారాలు
సీఐటీయూ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ మహాసభలను పురస్కరించుకుని నవంబర్ 11న హైదరాబాద్‌లో, 12,13 వరకు రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహించనున్న మానవహారాలను జయప్రద చేయాలని సీఐటీయూ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపు నిచ్చారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వేసిన కరపత్రాన్ని గురువారం హైదరాబాద్‌లోని సంఘం ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశ వ్యాప్తంగా ఏఐకెఎస్, తెలంగాణ రైతు సంఘం సమరశీల పోరాటాలను నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.
సుదీర్ఘ పోరాటాల చరిత్ర గలిగిన ఏఐకెఎస్ 36వ అఖిల భారత రైతు మహాసభలు నల్లగొండలో నవంబర్ 15 నుండి 18 వరకు జరగబోతున్నాయని తెలిపారు. మహాసభల ప్రారంభరోజైన నవంబర్ 15న తలపెట్టిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీ, ఆశ తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలి వచ్చేలా సీఐటీయూ జిల్లా కమిటీలు, మండల, గ్రామ సమన్వయ కమిటీలు విసృత ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)