Magazines

ఆర్టీసీ కార్మికుల రక్షణకు ‌‘ప్రవళిక చట్టం’ తేవాలి

17 నిమిషాల క్రితం

A ‘Pravalika Act’ should be introduced to protect RTC workers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం

మహాలక్ష్మి పథకం అమలుకు బస్సుల సంఖ్యను పెంచాలి

ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడిని తగ్గించాలి : సీఎం రేవంత్‌‌రెడ్డికి సీఐటీయూ లేఖ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఆర్టీసి కార్మికులకు రక్షణ కల్పించడం కోసం ప్రవళిక పేరుతో చట్టం తేవాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు ఈ మెయిల్‌ ‌ద్వారా సోమవారం లేఖ రాశారు. ప్రయాణికురాలు బస్ నుంచి కండక్టర్ ప్రవళికను తోసేసిన ఘటనలో ఆమె మరణించారని తెలిపారు. జి ప్రవళిక పేరుతో చట్టం తెచ్చి ఆర్టీసీ కండక్టర్ / డ్రైవర్లకు విధుల సమయంలో రక్షణ కల్పించాలని కోరారు.

ప్రవళిక ఘటన ఒక్కటే కాదనీ, డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తూ కొట్టిన ఘటసలు అనేకం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కండక్టరో, డ్రైవరో చిన్న తప్పు చేశారంటూ ఒక్క ఫోన్ కాల్‌ ‌లేదా సామాజిక మాధ్యమంలో అధికారులకు సమాచారం అందితే చాలు, వెంటనే వారిపై చర్యలు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సిబ్బందిపైన దాడులు జరిగితే ఎందుకు సరైన పద్ధతిలో రక్షించడంలేదని కార్మికులు, వారి కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. ఇటీవల విమానాల తరహాలో కండక్టరు ప్రయాణీకులకు స్వాగతం పలుకుతూ సిబ్బంది వివరాలతోపాటు సర్వీసు వివరాలు కూడా చెప్పిస్తున్నారని వివరించారు. అదే సమయంలో ఆర్టీసి సిబ్బంది ప్రజల కోసం సేవ చేస్తున్న వారిపై దాడులు జరగకుండా చూసేందుకు, దాడి చేసిన వారిపై కఠినమైన శిక్షలు విధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అర్ధంకాక కార్మికులు తీవ్ర మనస్థాపం చెందుతున్నారని తెలిపారు.

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందని ప్రయాణికులకు తెలిసేలా చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు.

రాష్ట్రంలో మహిళల ఉచిత ప్రయాణం "మహాలక్ష్మి" పథకాన్ని ప్రభుత్వం జయప్రదంగా అమలు చేస్తున్నదని ఆర్టిసీ కార్మికులేనని తెలిపారు. మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిందనీ, 68 శాతం వారే ఉన్నారని పేర్కొన్నారు. పెరిగిన ప్రయాణ అవసరాల మేరకు బస్సులను పెంచడం లేదని తెలిపారు. ప్రయాణంలో వచ్చే బాధ, కోపం ఆర్టీసీ సిబ్బందిపై చూపెడుతున్నారనీ, వారిపైన దాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో అవసరమైన మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ ‌చేశారు. అన్ని రూట్లలో శాస్త్రీయ పద్ధతిలో రూట్ సర్వే చేసి సరైన రన్నింగ్ సమయాన్ని ఇవ్వాలని కోరారు. సిబ్బంది భోజనం / టిఫిన్ తదితర అవసరాల కోసం ఇచ్చిన సమయం ప్రయాణీకులకు తెలిసేలా బస్‌‌లో ప్రకటించాలని సూచించారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలన్నింటిని వెంటనే భర్తీ చేసి, కార్మికులపై పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డిపోలు ఏర్పాటు చేయాలనీ, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఫ్రీక్వెన్సీతో బస్సులను సడపాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ మండల కేంద్రాల ప్రాతిపదికన ఎక్కువ ఫ్రీక్వెన్సీతో నడిపించేలా బస్సులను సమకూర్చాలని తెలిపారు. ప్రజల అవసరాల మేరకు డీజిల్ బస్సులనే కొని ఆపరేట్ చేసేలా నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతోపాటు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా భద్రత కల్పించాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్