14న పెద్దగడియారం సెంటర్ లో అగ్రి ఎక్స్పో - కల్చరల్ ఫెస్ట్
ఆటపాటలు, పల్లె సుద్దులు, భజనలు, కోలాటాలు,
జానపదాల ప్రదర్శన
వేలాదిగా రైతులు, ప్రజలు తరలిరావాలి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల పిలుపు
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభ సందర్భంగా నల్లగొండ పట్టణం ముస్తాబయింది. పెద్దగడియారం సెంటర్లో నవంబర్ 14న నిర్వహించనున్న అగ్రి ఎక్స్పో - కల్చరల్ ఫెస్ట్‌కు వేలాదిగా రైతులు, ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగే ఈ వేడుకల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పెద్దగడియారం సెంటర్లో కల్చరల్ ఫెస్ట్ కోసం ఏర్పాటు చేస్తున్న వేదికలను సోమవారం వారు పరిశీలించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, అనేక ఉద్యమాలకు అఖిల భారత రైతు సంఘం నాయకత్వం వహించిందని తెలిపారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 'దున్నేవాడికే భూమి' అనే నినాదంతో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటం ప్రజల విముక్తికి మార్గం చూపిందని గుర్తుచేశారు. రైతాంగ పోరాటాల చరిత్ర, సంస్కృతి, కళారూపాలను ప్రతిబింబించేలా అగ్రి ఎక్స్పో, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఆటపాటలు, పల్లె సుద్దులు, భజనలు, కోలాటాలు, జానపద కళారూపాలు, వేషధారణలు, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్య నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని వెల్లడించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పెద్దగడియారం సెంటర్లో పండుగ వాతావరణం నెలకొననుందని తెలిపారు. రైతాంగ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ జాతీయ మహాసభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, నలపరాజు సైదులు, అవుట రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)