జలాశయంలో నీళ్లు తగ్గితే కబ్జా
గ్రామ పెద్దల అండతో భూముల వేలం... శ్రీశైలం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో సాగు
అభివృద్ధి కమిటీల పేర వేలం
చూసీచూడనట్టుగా ఉంటున్న ప్రభుత్వ అధికారులు
ముంపు భూములపై పేదలకే హక్కు కల్పించాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ - మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జలాశయాల్లో నీళ్లు తగ్గడం వల్ల కొందరికి సాగునీటి సమస్యలు తీసుకురాగా .. మరికొందరికి కోట్ల రూపాయల వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఎల్‌నినో ప్రభావాన్ని డబ్బున్న వ్యాపారులు అనుకూలంగా మలచుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలో ఉండే అమ్మపూర్ బెక్కెమ్ గూడెం నాలా బెలుకు గడ్డ బస్వాపురం తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలను గ్రామ పెద్దలతో కుమ్ముక్కె కొందరు బడా వ్యాపారులు ప్రభుత్వ భూములను వేలం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు చెందాల్సిన భూముల్లో విత్తనం వేసి బడా వ్యాపారస్తులు పెత్తనం సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
50 ఏండ్ల కిందట శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. నాడు ఎకరానికి రూ.300 మాత్రమే పరిహారం పొంది నేడు వలస జీవులుగా జీవనం సాగిస్తున్నారు. మునిగిన భూములు తేలితే కొంతకాలం పట్టాదారులే సాగు చేసుకునేవారు. ఆ తరువాత గ్రామ పెద్దల చొరవ పెరిగింది. గ్రామాల అభివృద్ధి కమిటీల పేరుతో భూస్వాములంతా ఒకటై మునిగిపోయిన భూములను బడా వ్యాపారులకు వేలంపాట ద్వారా అప్పగిస్తూ వస్తున్నారు. బడా వ్యాపారుల దగ్గర అభివృద్ధి కమిటీలకు కాసుల పంట పండుతోంది. వలస వెళ్లిన పేదల భూములు తక్కువ ధరకు ఖరీదు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కనీసం గొర్రెలు, మేకలను కూడా మేతకు వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్టు నిర్వాసితులు మాత్రం దీనస్థితిలో వలసలు వెళుతున్న పరిస్థితి నెలకొంది.
చక్రం తిప్పుతున్న బడా వ్యాపారులు
గద్వాల నుంచి వచ్చిన ఓ ప్రముఖ వ్యాపారి పెబ్బేరులో పట్టి లేయర్ షాప్ నడుపుతూ శ్రీశైలం భూములపై కన్నేశాడు. ఒక వ్యాపారి సుమారు 800 ఎకరాలకు పైగా భూములు వేలం ద్వారా తీసుకొని పప్పు, శెనగ, మిర్చి, పెసర, మినుములు వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఎటు చూసినా ఈ వ్యాపారి భూములే ఉంటాయి.
అతని తమ్ముడు రంగారెడ్డి పెంట్లవెల్లిలో ఉంటూ ఇదే దందా నిర్వహిస్తున్నాడు. అతను సుమారు 600 ఎకరాలు సాగు చేస్తున్నట్టు సమాచారం. చిన్న సన్నకారు రైతులను బురిడీ కొట్టించి వారిచేత కాగితాలు రాయించు కొని బడా వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. నదికి వరద తగ్గినప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల భూములు తేలుతాయి. వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతు కమిటీలు పెద్దలు ఆధీనంలోకి తీసుకొని పెత్తనం చెలాయిస్తున్నారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో వేలం దందా తార స్థాయిలో ఉంది. ఇటీవల మూడు గ్రామాల పరిధిలో కోటి ముప్పై నాలుగు లక్షలు మేర వేలంపాట జరిగింది. 250 ఎకరాలకు 56 లక్షలు వేశారు. గూడెంలో 200 ఎకరాలకు 48 లక్షలు, గడ్డ బస్వాపురంలో 200 ఎకరాలకు 30 లక్షలు వేలంపాట ద్వారా వ్యాపారులకు అప్పగించారు. ఇలాంటి వెలుగు చూడని దందాలు వేలఎకరాల్లో ఉన్నాయి.
అభివృద్ధి కమిటీలు ఎవరికోసం?
గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కమిటీల పేరుతో భూస్వాములు ఒకటై వారు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. వ్యాపారులతో కుమ్మక్కై గ్రామ కమిటీల ద్వారా భూములను వేలం వేస్తారు. ముందే అవగాహన ఉండటంవల్ల భూస్వాములకు వ్యాపారులు కొంత ధనం ముట్ట చెపుతారు. గ్రామ కమిటీలకు వచ్చిన డబ్బులు సైతం దేవాలయాల అభివృద్ధి పేరుతో భూస్వాముల దగ్గరే ఉంచుకొని పేదలకు ఇవ్వరు. దీంతో పేదలకు ఉపాధి లేక వలస పోతున్నారు.
ప్రభుత్వ భూములు పేదలకే చెందాలి
రిజర్వాయర్‌లో నీళ్లు తగ్గడంతో తేలిన ముంపు భూములు పేద ప్రజలవి. వలసవాదులు వచ్చి భూము లను స్వాధీనం చేసుకుంటున్నారు. డబ్బుల్ని ఎరగా వేసి వేలాది ఎకరాలు తక్కువ ధరకు తీసుకొని వేరు శెనగ, పెసర, మినుము వంటి పంటలు సాగు చేస్తు న్నారు. ప్రాజెక్టు కోసం చిన్న,సన్నకారు రైతులు భూ ముల్ని ఇచ్చారు. అందుకే ఇటువంటి భూములను పరిశీలించి పేదలకే హక్కు కల్పించి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు.
మేకల ఆంజనేయులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వనపర్తి
భూములను మేమే సాగు చేసుకుంటాం
శ్రీశైలం రిజర్వాయర్‌లో మేము సాగుభూములు కోల్పోయాం. శ్రీశైలంలో నీళ్లు ఎండిపోవడంతో మా భూముల్లో వ్యాపారులు పాగా వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం వారికి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శ్రీశైలంలో మునిగిన భూములను మాకే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
శేఖర్ నాగరాజు -అమ్మాయి పల్లి వనపర్తి జిల్లా






కామెంట్‌లు (0)