Magazines

గ్రాసం కరువు.. గుక్కెడు నీటికి కటకట

20 నిమిషాల క్రితం

struggle
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 3 నిమిషాల చదవడం

ఎల్‌‌నినో దెబ్బకు పశుసంపద విలవిల

రూ. లక్ష పలికే కోడె రూ.50 వేలకే అమ్మకం

కండ్ల ముందే పశువులు చనిపోతాయనే భయంతో సంతకు తరలిస్తున్న రైతులు


ఒకప్పుడు గ్రామాల్లో రైతు ఇంట్లో ధన ధాన్యరాసులకు 
కొదవుండేది కాదు. ప్రతి ఇంటా పశువుల సవ్వడి వినిపించేది. వ్యవసాయంతో పాటు పశుపోషణ రైతుకు అదనపు ఆదాయాన్నే కాదు వ్యవసాయానికి అవసరమైన సేంద్రీయ ఎరువు , కుటుంబానికి ఆర్థిక భరోసానూ ఇచ్చేది. ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే కనిపించేది తక్కువే. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, పెరిగిన పెట్టుబడులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, అంతర్జాతీయ పరిణామాలు రైతును క్రమక్రమంగా వ్యవసాయానికి దూరం చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల యంత్రాలు పెరిగాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడా ఆ ఎల్ నినో ప్రభావం పశుసంపదపైనా, వ్యవసాయంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పశువులకు గడ్డి కొరత ఏర్పడుతోంది. దీంతో మేపేందుకు గ్రాసం, తాగునీరు కరువయ్యాయి.


నవతెలంగాణ - మహబూబ్ నగర్ 
ప్రాంతీయ ప్రతినిధి

పశువులను పోషించలేక, ఆకలితో కండ్లముందే చనిపోతాయన్న భయంతో రైతులు సంతలకు తరలిస్తున్నారు. తక్కువ ధరలకు రైతులు అమ్ముకుంటున్నారు. లక్ష రూపాయలకు పైగా విలువ చేసే కోడెలను సైతం రూ.50 వేలకే అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశువులు తిండి లేక కళ్ళముందే చనిపోయే దుస్థితిని చూడలేక సంతలకు తరలిస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిని పశుసంపదగానే చూడకూడదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. పట్టణ ప్రాంతాల్లో పశువులను పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఎంతోమంది ఉన్నారు.

​ సంతలకు పోటెత్తుతున్న పశువులు

ఎల్ నినో ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పశువులు, గొర్రెలు, మేకలపై తీవ్రంగా పడింది. వనపర్తి జిల్లా పెబ్బేరు, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి లో జరిగే సంతల్లో లక్ష రూపాయలు పైగా పలికే కోడెను రూ. 50 వేలకే అమ్ముకుంటున్నారు. గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రానికి చెందిన దావీదు గ్రాసం లేక లక్ష రూపాయలు విలువచేసే రెండు ఎడ్లను రూ.50 వేలకే అమ్ముకున్నాడు. ఇటిక్యాల మండలం సాగాపూర్ గ్రామానికి చెందిన సైదులు లక్షా 25 వేల రూపాయలు విలువచేసే కోడెను 65 వేలకే దళారులకు అమ్ముకున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు గ్రామానికి చెందిన కురుమూర్తి రెండు ఎడ్లను అమ్మకానికి పెట్టాడు. ఒక్కోఎద్దు లక్ష రూపాయలకు అమ్మాల్సి ఉండగా, అయితే సంతకు పశువులు పోటు ఎత్తడంతో వ్యాపారులు 50 వేలకే కొనుగోలు చేశారు. ప్రతి శనివారం జరిగే పెబ్బేరు సంతకు 5వేల పశువులు వస్తుం టాయి. మారిన వాతావరణ పరిస్థితులు గ్రాసం కొరత వల్ల 10వేల పశువుల వరకూ వచ్చాయి. ఇదే పరిస్థితి దేవరకద్ర ,కల్వకుర్తి ,నారాయణపేట, వనపర్తి ,గద్వాల జిల్లాలోనూ కనిపిస్తోంది.

​పడిపోయిన ధరలు

ఒక్కసారిగా సంతకు పశువులు పోటెత్తడంతో ధరలు పడిపోయాయి. పశువులను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొనుగోలు దారులూ లేరు. దీంతో రైతుల అవసరాన్ని దళారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఇంకా పది సంవత్సరాలు పని చేసే కోడెలను సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పశు పోషణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే రైతులు పశువులు అమ్ముకునే వారు కాదు అని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఎల్ నినో నుండి పశువులను కాపాడుకోలేక పోతే పశు సంపద పూర్తిగా లేకుండా పోతుందని పలువురు తెలిపారు. ఇప్పటికైనా స్పందించకపోతే పశుసంపద గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.


​పశువులను కాపాడుకోలేం.. చనిపోతే చూడలేం

ఆరుగాలం కష్టం చేసిన పశువులు కండ్ల ముందు చనిపోతే చూస్తూ ఉండలేము. అందుకే ఇంటి ముందు చనిపోతే భరించ లేకనే పశువుల సంతలో వచ్చిన కాడికి అమ్ముకుంటున్నాం. పాలిచ్చే గేదె అయినా కాడికింది పశువైనా ఆకలితో ఉంటే చూడలేకనే పశువుల ను అమ్ముకుంటున్నాం .
- కురుమూర్తి ,రైతు , నారాయణపేట జిల్లా


నీళ్లు లేవు.. పంటలు లేవు

వర్షాలు లేక చెరువులెండి పోయాయి వాగులు ఇంకిపోయాయి. పశువులను బతికించుకునే పరిస్థితి లేదు.
-​ సైదులు సాగాపూర్ ఇటిక్యాలా మండలం గద్వాల జిల్లా


​పశువులను 
కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

జిల్లాలో పసుపు సంపద పరిస్థితి దయనీయంగా మారింది. పశువుల జాతి నశించిపోతున్నది. ఇప్పుడు ఏల్ ని నో ప్రభావంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రభుత్వం స్పందించి పశుగ్రాసం ఏర్పాటు చేయాలి. తాగు నీటి సౌకర్యం కల్పించాలి. లేనిచో పశుసంపద పరిస్థితి సంక్షోభంలో పడుతున్నది.
- బాలయ్య ,సీపీఐ(ఎం), పెబ్బేరు మండల కార్యదర్శి, వనపర్తి జిల్లా​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్