డీఎంహెచ్ఎస్ కార్యాలయం ఎదుట ఎఫ్ఎంజీ వైద్యుల ధర్నా
అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ - సుల్తాన్ బజార్
నెలకు రూ.29,792 స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎఫ్ఎంజీ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్) వైద్యులు శుక్రవారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమకు నెలకు రూ.5 వేల ఉపకార వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వైద్య విద్య పూర్తి చేసిన శిక్షణార్థులకు నెలకు రూ.29,792 స్టైఫండ్ అందిస్తుండగా, తమకు మాత్రం తక్కువ మొత్తం చెల్లించడం అన్యాయమన్నారు.
సమాన పనికి సమాన వేతనం అనే న్యాయసూత్రం ప్రకారం తమకు కూడా సమాన స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో విదేశీ వైద్య పట్టభద్రుల శిక్షణార్థులకు స్థానిక వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ చెల్లిస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై డీఎంఈతో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రికి పలుమార్లు వినతులు అందించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైద్యులను పోలీసులు సముదాయిం చినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడంతో అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.






కామెంట్లు (0)